● అర్హులందరికీ సంక్షేమ ఫలాలు ● మంత్రి పొన్నం ప్రభాకర్
కోహెడరూరల్(హుస్నాబాద్): ఏడాదిలోగా గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం ‘పల్లె పల్లెకు– పొన్నమన్న’ కార్యక్రమంలో భాగంగా మండలంలోని పరివేద, నకిరేకోముల, శ్రీరాములపల్లి, కాచాపూర్, మైసంపల్లి గ్రామాల్లో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రధాన కుడళ్లలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. 20 ఏళ్లుగా ఎదురుచూస్తున్న గౌరవెల్లి ప్రాజెక్టు త్వరలోనే అందుబాటులోకి రానుందని అన్నారు. నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధికే ‘పల్లె పల్లెకు– పొన్నమన్న’ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. నియోజకవర్గంలోని 173 గ్రామాల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు సక్రమంగా అందుతున్నాయా? లేదా అని పరిశీలించడంతో పాటు స్థానికంగా ఉన్న సమస్యలను తెలుసుకొని పరిష్కారించడమే ఈకార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని అన్నారు. ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులు ఆరుతడి పంటలను సాగు చేసుకోవాలని సూచించారు. తాము అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రెండు విడతలుగా ఇందిరమ్మ ఇళ్లను ఇచ్చామన్నారు. పైరవీలకు తావులేకుండా అర్హత కలిగిన లబ్ధిదారులకు విడతలవారీగా ఇళ్లును మంజూరు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మికిరణ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


