మిరుదొడ్డి(దుబ్బాక): దివ్యాంగుల హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తోందని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు తోట కమలాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.6 వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మిరుదొడ్డిలో దివ్యాంగులు కదం దొక్కారు. స్థానిక హనుమాన్ దేవాలయం నుంచి ఎంపీడీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఎంపీడీఓ కార్యాలయం ఎదుట బైటాయించి మహా ధర్నా కార్యక్రమం చేపట్టారు. ప్లకార్డులతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దివ్యాంగుల ధర్నా కార్యక్రమానికి డీబీఎఫ్ (దళిత బహుజన ఫ్రంట్ ) జాతీయ కార్యదర్శి పి.శంకర్, తెలంగాణ ఉద్యమకారుడు గణేష్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ దివ్యాంగులకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎంపీడీఓ వినోద్ కుమార్‌కు దివ్యాంగులతో కలిసి అందజేశారు.


