సబ్సిడీ విత్తనం అరకొరే | - | Sakshi
Sakshi News home page

సబ్సిడీ విత్తనం అరకొరే

Oct 5 2026 8:30 AM | Updated on Oct 5 2026 8:30 AM

ఎల్‌నినో ప్రభావం వల్ల వానాకాలం సాగులో తీవ్రంగా నష్టపోయి... కనీసం యాసంగి సాగుతో ఊరట పొందాలనుకున్న రైతులకు నిరాశే మిగిలింది. సబ్సిడీపై అందజేస్తున్న శనగ విత్తనాల పంపిణీ అరకొరగా సాగుతోంది. జిల్లా రైతుల అవసరాలకు ఏమాత్రం పొంతనలేకుండా కేవలం మూడు మండలాల్లో కేవలం 44.9క్వింటాళ్ల విత్తనాలను మాత్రమే 70% సబ్సీడీ అందజేసే ప్రక్రియను వ్యవసాయశాఖ ప్రారంభించింది. ఈ మూడు మండలాల్లోనూ రైతులకు సరిపడా విత్తనాలు అందే పరిస్థితి లేదు. పొద్దు తిరుగుడు విత్తనాల పంపిణీలోనూ ఇదేరకమైన పరిస్థితి నెలకొంది.

–గజ్వేల్‌

జిల్లాలో ప్రస్తుత యాసంగి సీజన్‌లో సుమారుగా 2.5 లక్షల ఎకరాలకుపైగా వివిధ రకాల పంటలు సాగులోకి వచ్చే అవకాశముంది. ఇందులో 2,500ఎకరాలకుపైగా శనగ పంట సాగులోకి వచ్చే అవకాశముంది. ఇందుకోసం కనీసం 1,500 క్వింటాళ్లకుపైగా సబ్సిడీ విత్తనాలు అవసరముంటాయి. కానీ పంపిణీ తీరు చూస్తే ముక్కున వేలేసుకునేలా చేస్తున్నది.

44.9క్వింటాళ్లు మాత్రమే పంపిణీ

శనగ విత్తనాలను 70% సబ్సిడీపై అందజేయడానికి సిద్దిపేట జిల్లాను మిషన్‌ ఫర్‌ ఆత్మనిర్భరత ఇన్‌ పల్సెస్‌(ఎంఏఎన్‌పీ) కింద ఎంపిక చేశారు. ఈ క్రమంలోనే జిల్లాలో శనగ సాగు అధికంగా ఉండే గజ్వేల్‌, జగదేవ్‌పూర్‌, బెజ్జంకి మండలాలను ఎంపిక చేశారు. ఈ మూడు మండలాల్లో తక్కవలో తక్కువగా 1000 వేల ఎకరాల్లో శనగ సాగులోకి వచ్చే అవకాశముంది. ఇందుకోసం సుమారుగా 600 క్వింటాళ్లకుపైగా విత్తనాలు అవసరముంటాయి. కానీ ప్రభుత్వం అందజేస్తున్నది. 44.9క్వింటాళ్లు మాత్రమే. పంపిణీ కార్యక్రమాన్ని ఆ మండలాల్లో శనివారం ప్రారంభించారు. ఈ మండలాల్లోనూ అవసరాలకు, పంపిణీ తీరుకు పొంతన లేకపోవడంతో రైతులు నిరాశకు గురవుతున్నారు.

పొద్దు తిరుగుడు విత్తనాల తీరు అదే..

జాతీయ నూనె గింజల మిషన్‌ కింద సైతం సబ్సిడీ పొద్దు తిరుగుడు విత్తనాలను అందజేయడానికి సైతం జిల్లాను ఎంపిక చేశారు. వందశాతం సబ్సిడీపై విత్తనాల పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. కానీ జిల్లాలోని అన్ని మండలాల్లో పొద్దుతిరుగుడు సాగుకు రైతులు సిద్ధంగా ఉంటారు. కానీ సబ్సిడీ విత్తన పంపిణీ కొన్ని మండలాలకే పరిమితం కావడం రైతులను ఆందోళనకు గురిచేస్తున్నది. వేరుశనగ విత్తనాల పంపిణీ పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది.

పదేళ్లుగా సబ్సిడీకి మంగళం...

శనగ విత్తనాల సబ్సిడీకి గత పదేళ్లుగా మంగళం పాడారు. ఈసారి ఇస్తారనురనుకుంటే అదీ కూడా అరకొర పంపిణీ చేయడంపై విమర్శలొస్తున్నాయి. నల్లరేగడిలో కొద్దిపాటి తేమ ఉంటే చాలు మొలకెత్తే అవకాశముంటుంది. ఆ తర్వాత చలికాలంలో వచ్చే పొగ మంచుతో పంటకు మంచి దిగుబడి వచ్చే అవకాశముంటుంది. అందువల్లే ఈ పంటకు మొగ్గు చూపుతారు. కానీ సబ్సిడీ విత్తనాలు సరిపడనంతగా అందక రైతులు ఆందోళన చెందుతున్నారు.

శనగ విత్తనాలు 44.9 క్వింటాళ్లు మాత్రమే

మూడు మండలాల్లోనే పంపిణీ

అక్కడ కూడా అత్యల్పంగానే

పొద్దుతిరుగుడు విత్తనాల పంపిణీ తీరు అంతే

యాసంగి సాగు సిద్ధమవుతున్న రైతుకు నిరాశే

సిద్దిపేట జిల్లాలో పరిస్థితి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement