బీఆర్‌ఎస్‌ హయాంలోనే ముస్లింల సంక్షేమం | - | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ హయాంలోనే ముస్లింల సంక్షేమం

Oct 5 2026 8:30 AM | Updated on Oct 5 2026 8:30 AM

● హామీలు మరిచిన కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి

● మాజీమంత్రి, శాసనసభ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌రావు

గజ్వేల్‌: బీఆర్‌ఎస్‌ హయాంలోనే ముస్లింల సంక్షేమానికి పెద్దపీట వేసినట్లు మాజీ మంత్రి, శాసనసభ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌రావు తెలిపారు. ఆదివారం గజ్వేల్‌లో బీఆర్‌ఎస్‌ నాయకుడు అలీ మస్కతి ఆధ్వర్యంలో గజ్వేల్‌ ప్రాంతంలోని తుర్కకాశ కుటుంబాలకు రాళ్లను కట్‌చేసే పనిముట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హరీశ్‌రావు ప్రసంగిస్తూ కేసీఆర్‌ ముస్లింల వెనుకబాటుతనాన్ని గమనించి అప్పట్లో బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించారని గుర్తు చేశారు. ఏటా రూ. 3000 నుంచి రూ.3,500 కోట్ల వరకు నిధులను కేటాయించిన ఘనత బీఆర్‌ఎస్‌కే దక్కిందన్నారు. అదేవిధంగా ముస్లింల అభ్యున్నతికి విరివిగా సంక్షేమ పథకాలను అమలు చేసినట్లు గుర్తు చేశారు. 204 మైనార్టీ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి విద్యారంగంలో ముస్లింల పిల్లలను తీర్చిదిద్దినట్లు చెప్పారు.

విదేశాల్లో విద్యకు రుణసదుపాయం..

విదేశాల్లో చదువుకునే వారికోసం రుణసదుయాపాన్ని కల్పించినట్లు ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు. పదేళ్లలో ముస్లింల అభ్యున్నతికి చేపట్టిన కార్యక్రమాలు గొప్ప పరివర్తనకు నాంది పలికాయన్నారు. ఎన్నో హామీలనిచ్చి గద్దెనెక్కిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముస్లింల సంక్షేమాన్ని పూర్తిగా తుంగలో తొక్కారని విమర్శించారు. ఏటా రూ.4వేల కోట్ల బడ్జెట్‌ కేటాయింపులు జరుపుతామని చెప్పి ఆచరణలో విఫలమయ్యారని మండిపడ్డారు. ఎల్‌నినో తీవ్రరూపం దాల్చిన తరుణంలో రిజర్వాయర్ల నుంచి సాగునీటిని అందించలేక ప్రభుత్వం అసమర్ధతతను చాటుకుంటుందని మండిపడ్డారు. మల్లన్నసాగర్‌ నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ప్రతిపక్షంలో ఉండగా మాట ఇచ్చిన రేవంత్‌రెడ్డి నేడు సీఎం హోదాలో ఆ మాటే మరచిపోయారని ఆరోపించారు.

జిల్లా ఖ్యాతి ఉట్టిపడేలా పదేండ్ల పండుగ

సిద్దిపేటజోన్‌: సిద్దిపేట జిల్లా ఖ్యాతి ఎల్లలు దాటేలా, సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా పదేండ్ల పండుగ సంబరం ఘనంగా నిర్వహిద్దామని మాజీ మంత్రి హరీశ్‌రావు దిశానిర్దేశం చేశారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా ఏర్పడి అక్టోబర్‌ 11 నాటికి పదేండ్లు పూర్తి నేపథ్యంలో సంబురాల నిర్వహ ణపై మేధావులు, కవులు, కళాకారులు, జర్నలిస్టులు, న్యాయవాదులు, వైద్యులు, ప్రజా సంఘాలు, రిటైర్డ్‌ ఉద్యోగులు, ఉపాధ్యా య సంఘాల ప్రతినిధులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...అప్పట్లో జిల్లా ఏర్పాటు కోసం అర్జీ పెట్టిన నాయకుడు కేసీఆర్‌ అని అన్నారు. సిద్దిపేట జిల్లా, గోదావరి జలాలు, సిద్దిపేట రైల్వే లైన్‌, నినాదాలను తెలంగాణ రాష్ట్రంలో సఫలీకృతం చేసుకోవడం ఓ సువర్ణాధ్యాయంగా అభివర్ణించారు. సిద్దిపేట జిల్లా సాధించిన ప్రగతి గూర్చి భవిష్యత్తు తరాలకు తెలిపే బాధ్యత మన అందరిపై ఉందన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌, మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్‌, పార్టీ రాష్ట్ర కార్యదర్శి శర్మ, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్స్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement