అక్కన్నపేట మండలం గౌరవెల్లి రిజర్వాయర్ నుంచి నేరుగా హుస్నాబాద్ పట్టణానికి తాగునీటి సరఫరా చేసేందుకు చేపట్టే ప్రాజెక్టు సర్వే పనులను ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు ముమ్మరం చేశారు. ఈ నెల 15న వరల్డ్ బ్యాంక్ అధికారుల ప్రతినిధి బృంద సభ్యులు గౌరవెల్లి ప్రాజెక్టును సందర్శించనున్నారు. ప్రాజెక్టు తీరుతెన్నులు పరిశీలించి పలు సలహాలు, సూచనలు చేయనున్నారు. రిజర్వాయర్ వద్ద ఇంటెక్ వెల్‌ను ఏర్పాటు చేసి, నీటి సరఫరా కోసం ప్రత్యేకంగా విద్యుత్ మోటర్లను బిగించనున్నారు. ఎల్లమ్మ చెరువు సమీపంలోని సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద రూ.4 కోట్ల వ్యయంతో వాటర్ ట్రీట్‌మెంట్ కోస్ట్‌ను నిర్మిస్తారు. గౌరవెల్లి నుంచి హుస్నాబాద్ వరకు దాదాపు 6 కిలో మీటర్ల మేర పైపులైన్ నిర్మించి నేరుగా నీటి శుద్ధి కేంద్రానికి నీటిని తరలిస్తారు. శుద్ధి చేసిన నీటిని సిద్ధేశ్వరాలయం గుట్టపై ఏర్పాటు చేసిన అతి పెద్ద నీటి ట్యాంక్‌లోకి పంపిస్తారు. అక్కడి నుంచి మిగతా ట్యాంక్‌ల ద్వారా ప్రతీ రోజు ఇంటింటికీ నీటి సరఫరా చేస్తారు. ఈ ప్రాజెక్టు ద్వారా గౌరవెల్లి నుంచి రోజు 10 ఎంఎల్‌డీ అంటే కోటి లీటర్ల నీటిని హుస్నాబాద్‌కు తరలించే అవకాశం ఉంటుంది. సర్వే పనులు సకాలంలో పూర్తి చేస్తే వచ్చే నెలలో సీఎం రేవంత్‌రెడ్డి సిద్దిపేట జిల్లా పర్యటనలో భాగంగా తాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసే అవకాశం ఉంటుందని విశ్వసనీయవర్గాల సమాచారం.


