ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ‘ఎన్నాళ్లీ కంపు’ అంటు ఈనెల 2న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి స్పందించిన మున్సిపల్ అధికారులు, సిబ్బంది మురుగును తొలగించారు. జిల్లా కేంద్రంలోని మారుతినగర్ వీధి నంబర్–1లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో కాలనీలో మురుగు నీరు నిలిచింది. దీంతో పాటుగా మ్యాన్ హోల్‌లో నుంచి మురుగు నీరు కాలనీలో విచ్చలవిడిగా ప్రవహించటంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా దుర్వాసన, దోమలు, ఈగలతో పలువురు అనారోగ్యం బారినపడ్డారు. ఈక్రమంలో ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంతో మున్సిపల్ అధికారులు, సిబ్బంది త్వరగా స్పందించి మురుగును తొలగించారు. దీంతో నేడు కాలనీ వాసులు ఇబ్బందులు లేకుండా హ్యాపీగా ఉంటున్నారు. ఈసందర్భంగా సాక్షికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


