● ఏఎంసీ చైర్మన్ విజయ మోహన్ ● సాదాసీదాగా వర్గల్ మండల పరిషత్ సమావేశం
వర్గల్(గజ్వేల్): అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మార్కెట్ కమిటీ చైర్మన్ విజయమోహన్ అన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సమావేశం సాదాసీదాగా కొనసాగింది. ఈ సందర్భంగా ఎంపీడీవో సురేష్ మాట్లాడుతూ ఎల్ నినో నేపథ్యంలో రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, జలసిరి ద్వారా ఫామ్ పాండ్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. విద్యుత్ సంబంధ సమస్యలను సర్పంచ్‌లు సభ ద్వారా అధికారుల దృష్టికి తెచ్చారు. వాటి పరిష్కారానికి తగు చర్యలు చేపడతామని విద్యుత్ ఏఈ వాసుదేవరావు తెలిపారు. ఉద్యాన శాఖ ద్వారా వివిధ సబ్సిడీ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఉద్యాన విస్తరణ అధికారి సుధాకర్ రెడ్డి సభ్యులకు సూచించారు. సమావేశంలో గ్రామపంచాయతీ గ్రాంట్లు, మహిళా, శిశుసంక్షేమం, పశు పోషణ, జలసిరి పనులు తదితర అంశాలపై చర్చించారు.


