గజ్వేల్: అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై నిర్వహించే చర్చలో పాల్గొంటారా? లేక తన పదవికి రాజీనామా చేస్తారో కేసీఆర్ తేల్చుకోవాలని రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన, పరిశ్రమలు, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ అన్నారు. కేసీఆర్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ గజ్వేల్‌లో డీసీసీ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డి, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిల ఆధ్వర్యంలో శనివారం గజ్వేల్‌లో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం నిర్వహించిన సభలో మంత్రి వివేక్ పాల్గొని ప్రసంగించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ బీఆర్‌ఎస్ అవినీతికి పరాకాష్టగా మారిందన్నారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో రూ.1000కోట్ల క్విడ్‌ప్రోకు పాల్పడ్డారన్నారు. మరోవైపు ఫార్ములా వన్ రేసింగ్‌లోనూ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ పాలన పూర్తిగా అవినీతిమయంగా మారటం వల్లే ప్రజలు గద్దె దింపారని అన్నారు. ఓట్లేసి గెలిపించిన గజ్వేల్ ప్రజలను సైతం కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు. అవీనితిని అడ్రస్‌గా మారిన కాళేశ్వరంపై సమగ్రంగా చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇప్పటికై నా ఈనెల 7నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరై చర్చల్లో పాల్గొనాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పదవికి రాజీనామా చేయాలన్నారు. కాగా అభివృద్ధి, సంక్షేమంపై తమ ప్రభుత్వంపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. గత బీఆర్‌ఎస్ సంక్షేమాన్ని విస్మరిస్తే...నేడు తమ ప్రభుత్వం పేదల సంక్షేమమే లక్ష్యంగా ముందుకుసాగుతోందన్నారు. అంతకుముందు గజ్వేల్ రింగు రోడ్డుపై కాంగ్రెస్ కార్యకర్తలనుద్దేశించి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, సీనియర్ నేత వి.హన్మంతరావు మాట్లాడుతూ కేసీఆర్ ఇప్పటికై నా ఎర్రవల్లి ఫామ్‌హౌస్ వీడి.. అసెంబ్లీకి వచ్చి గజ్వేల్ ప్రజల సమస్యలను తీర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమాల్లో డీసీసీబీ మాజీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు ఎలక్షన్‌రెడ్డి, భూంరెడ్డి, ఏఎంసీ చైర్మన్లు నరేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, విజయామెహన్, వైస్ చైర్మన్ సర్ధార్‌ఖాన్, టీపీసీసీ కార్యదర్శి నాయిని యాదగిరి, కాంగ్రెస్ ప్రచార కమీటీ కన్వీనర్ నిమ్మ రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గజ్వేల్ ప్రజలను మోసం చేస్తారా?
ప్రతిపక్ష నేతగా కేసీఆర్ విఫలం
కార్మిక శాఖ మంత్రి వివేక్
గజ్వేల్‌లో కాంగ్రెస్ శ్రేణుల భారీ ర్యాలీ


