నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు
నినాదాలు చేస్తున్న జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ రోజాశర్మ తదితరులు
సిద్దిపేటజోన్: ఎన్నికల్లో మహిళల ఓట్ల కోసం కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ రోజాశర్మ అన్నారు. మహిళలు అంటే ఎందుకు ఇంత నిర్లక్ష్యమని ప్రశ్నించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో వేంకటేశ్వర దేవాలయం వద్ద కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలన వైఫల్యాలను ఎండగడుతూ బీఆర్‌ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో వంటవార్పు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వెయ్యి రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని ఆరోపించారు. మహిళలకు రూ.2,500, ఆసరా పథకం పెంపు, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ ద్వారా తులం బంగారం, విద్యార్థులకు స్కూటీ.. ఇలా అన్నీ హామీలను విస్మరించారని అన్నారు. మరోవైపు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని రద్దు చేయాలని ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు. రాబోయే ఎన్నికల్లో మహిళలు అంతా ఒక్కటై కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ మంజుల, మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్స్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్‌లు వేణుగోపాల్ రెడ్డి, సాయిరాం, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కనకరాజు, మాజీ కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కల్యాణలక్ష్మి రద్దు చేసే కుట్ర
వచ్చే ఎన్నికల్లో గుణపాఠం తప్పదు
జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ రోజాశర్మ


