సర్కారు బడిని బాగుచేసిన హెడ్‌మాస్టర్
బడిపిల్లల కోసం సొంత ఖర్చుతో ఆటో సౌకర్యం
కొండపాక(గజ్వేల్): మండల పరిధి సిర్సనగండ్లలోని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జయప్రకాశ్‌రెడ్డి ఆదర్శంగా నిలుస్తున్నారు. సర్కార్ బడిని సుందరంగా తీర్చిదిద్ది, విద్యార్థుల సంఖ్య పెంచుతూ.. సొంత ఖర్చుతో ఆటో సౌకర్యం కల్పించారు. విద్యార్థులు ఇంటి నుంచి పాఠశాలకు వచ్చేందుకు రెండు ఆటోలను ఏర్పాటు చేసి నెలకు రూ.20 వేల వరకు వెచ్చిస్తున్నారు. పాఠశాల ఆవరణలో ఆట వస్తువులు, విద్యార్థులకు క్రీడా దుస్తులు, స్వచ్చమైన తాగు నీటి ఆర్వో ప్లాంట్, బోధన సులువుగా అర్థం అయ్యేలా ఐఎఫ్‌బీ స్క్రీన్ ఎల్‌ఈడీ ప్యానల్, కంప్యూటర్, తరగతి గదుల్లో కార్పెట్లు, పాఠశాలలోని గధుల్లో అందమైన కలర్లు వేయడం వంటి వాటి కోసం ఇప్పటి వరకు సుమారు రూ. 10లక్షలను ఖర్చు చేశారు. బడి బాట కార్యక్రమంలో ఇంటింటికీ తిరుగుతూ ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే సుమారు70 మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. ప్రస్తుతం 182 మంది విద్యార్థులకు విద్యాభ్యాసం అందుతోంది. హెచ్‌ఎం చేస్తున్న కృషిని గ్రామస్తులు అభినందిస్తున్నారు.


