● అన్ని రంగాల్లో హుస్నాబాద్ అభివృద్ధే లక్ష్యం ● మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్: నియోజకవర్గంలోని ప్రతి మండలంలో విద్యా సంస్థను నెలకొల్పి నియోజకవర్గాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా మారుస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం మండలంలోని ఉమ్మాపూర్‌లో ఇంజనీరింగ్ కళాశాల బాలుర, బాలికల హాస్టళ్ల భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఒక్కో హాస్టల్ రూ.7.28 కోట్లు చొప్పున మొత్తం రూ.14.56 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కళాశాలలో 295 మంది విద్యార్థులు ఉన్నారని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త కోర్సులు తీసుకువస్తామన్నారు. విద్యార్ధులు బాగా చదివి మంచి ర్యాంకులు తెచ్చుకోవాలని, మౌలిక వసతులు కల్పించే బాధ్యత నాదని, మీకు గార్డియన్‌గా ఉంటానన్నారు. సైదాపూర్‌కు మరో ఇంటిగ్రేటెడ్ స్కూల్ రాబోతుందని తెలిపారు. భీమదేవరపల్లి లో నవోదయ స్కూల్, చిగురుమామిడి మండలంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్, ఎల్కతుర్తి మండలానికి బాసర ట్రిపుల్ ఐటీ బ్రాంచ్ రాబోతుంది. కార్యక్రమంలో శాతవాహన యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ఉమేష్ కుమార్ తదితరులు ఉన్నారు.
బీఆర్‌ఎస్ నేతలను నిలదీయండి
అక్కన్నపేట(హుస్నాబాద్): రాష్ట్రాన్ని అప్పులమయం చేసిన వారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరసనలకు పిలుపునివ్వడం విడ్డూరంగా ఉందని మంత్రి పొన్నం మండిపడ్డారు. సోమవారం చాపగానీతండాలో విలేకరులతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ నాయకులు గ్రామాల్లోకి వచ్చినప్పుడు ప్రజలు వారిని నిలదీయాలని మంత్రి పిలుపునిచ్చారు. మీరు డబుల్ బెడ్రూం ఇళ్లు ఎన్ని ఇచ్చారు? ప్రతి కుటుంబానికి మూడు ఎకరాల భూమి ఎక్కడ? మీ పదేళ్ల పాలనలో ప్రజలకు ఏ పథకాలు అందించారో చెప్పాలన్నారు.


