ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
మిరుదొడ్డి(దుబ్బాక): వృత్తి రీత్యా చేసిన మంచి సేవలే సమాజంలో మంచి గుర్తింపునిస్తాయని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తెలిపారు. మండల పరిధిలోని అల్వాల చెప్యాల క్రాస్ రోడ్డులో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల/కళాశాల ప్రిన్సిపాల్ రఘునందన్‌రావు ఉద్యోగ విరమణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి శారదతో కలిసి ప్రిన్సిపాల్ రఘునందన్‌రావు దంపతులను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...వృత్తి రీత్యా పదవీ విరమణ సర్వసాధారణమన్నారు. విద్యార్థులను ఉన్నత శిఖరాలను చేర్చడంలో టీచర్లు, తల్లిదండ్రుల సమష్టి కృషి దాగి ఉంటుందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థుల్లో దాగి ఉన్న గుణాత్మకశక్తిని వెలికి తీయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని తెలిపారు. ఒక విద్యార్థి అత్యున్నతస్థానంలో ఉన్నాడంటే ఉపాధ్యాయుల కృషి ఎంతో దాగి ఉంటుందన్నారు. తల్లిదండ్రుల ఆశయాలకనుగుణంగా విద్యార్థులు కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత శిఖారాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు తోట కమలాకర్ రెడ్డి, టీచర్లు, లెక్చరర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.


