నాబార్డు ప్రధానాధికారి ఉదయ్ భాస్కర్
సిద్దిపేటకమాన్: గ్రామీణాభివృద్ధి, సుస్థిర వ్యవసాయం, గ్రామీణ సదుపాయాల కల్పన, జీవనోపాధి అవకాశాల విస్తరణ, గ్రామీణ ఆర్థికాభివృద్ధిలో నాబార్డు కీలకపాత్ర పోషిస్తుందని నాబార్డ్ తెలంగాణ ప్రాంతీయ కార్యాలయ ప్రధానాధికారి బి.ఉదయ్ భాస్కర్ తెలిపారు. సిద్దిపేటలో నాబార్డు జిల్లా కార్యాలయాన్ని లీడ్ బ్యాంకు మేనేజర్ హరిబాబుతో కలిసి ఉదయ్‌భాస్కర్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు, గ్రామీణ పారిశ్రామికవేత్తలు, స్వయం ఉపాధి వర్గాలు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలకు బ్యాంకులు సకాలంలో తగిన స్థాయిలో రుణ సహాయం అందించాలని సూచించారు. వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక వినియోగం, ఉద్యానవన పంటల ప్రోత్సాహం, పశుసంవర్థక కార్యకలాపాలపై వివరించారు. గ్రామీణ యువతకు అందిస్తున్న అవకాశాలపై సమీక్ష నిర్వహించి, సంస్థ పనితీరును అభినందించారు. జిల్లా స్థాయిలో నాబార్డు సేవలు మరింత చేరువ కావడంతో పాటు బ్యాంకింగ్ రంగం, ప్రభుత్వ శాఖలు, రైతు, గ్రామీణాభివృద్ధి సంస్థల మధ్య సమన్వయం మరింత బలోపేతం కానుందన్నారు. కార్యక్రమంలో నాబార్డు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సునీల్, డీడీఎం నిఖిల్‌రెడ్డి, రాథోడ్, సుధీర్, హనుమంతరెడ్డి, శిరీష, వర్మ, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.


