8 గ్రాములు కాజేసిన కేటుగాళ్లు
తొగుట(దుబ్బాక): పాత నగలు కడిగి కొత్తవాటిలా మెరిపిస్తామని కేటుగాళ్లు అమాయక మహిళను మోసం చేసి బంగారంతో ఉడాయించారు. ఈ సంఘటన మండలంలోని వెంకట్రావుపేటలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, బాధిత మహిళ కథనం ప్రకారం... శనివారం ఉద యం గ్రామంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు సంచరిస్తూ బంగారం, వెండి ఆభరణాలు కడుగుతామని వీధుల్లో తిరిగారు. పలువురు మహిళలను నమ్మించేందుకు ప్రయత్నించగా ఎవరూ ముందుకు రాలేదు. ఈ క్రమంలో కళ్లెపు అనూష ఇంటికి వారు వెళ్లారు. ఆమె ఆరుబయట బట్టలు ఉతుకుతోంది. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికి చేరుకొని బంగారు ఆభరణాలు కడిగిస్తామని నమ్మబలికారు. వారి మాటలను ఆమె విశ్వసించకుండా తనపని తాను చేసుకుంటోంది. దీంతో ఆమె వద్దకు వెళ్లి చేతిలో ఏదో ఫౌడర్ పోసి నగ లు కడగాలని సూచించారు. దీంతో వారి మాటలు నమ్మి తన పుస్తెల తాడును ఆమె చెల్లి పట్టగొలుసులు కూడా ఇచ్చింది. వారు రెండు నగలను ఏదో ద్రావణంతో కడిగి ఆమెకు నగలు ఇచ్చి అక్కడి నుంచి ఉడాయించారు. నగల బరువు తక్కువగా ఉండటం గమనించిన అనూష వెంటనే స్థానిక బంగారం దుకాణంలో తూకం వేయించగా 8గ్రాముల బంగారం కాజేసినట్టు గుర్తించారు. దీంతో తాను మోసపోయానని ఆమె బోరున విలపించింది. గ్రామస్తులు కేటుగాళ్ల కోసం వెతకగా వారి ఆచూకీ లభించలేదు. ఘటనపై సమాచారం అందుకున్న తొగుట పోలీసులు విచారణ చేపట్టి కేటుగాళ్ల కోసం గాలింపు చేపట్టారు. గుర్తుతెలియని వ్యక్తులు గ్రామాల్లో సంచరిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ఎస్‌ఐ రవికాంత్‌రావు ప్రజలను కోరారు.


