పథకాల అవగాహనకే
99 రోజుల కార్యక్రమాలు
రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి
పొన్నం ప్రభాకర్
డిగ్రీ కళాశాల మైదానంలో
రాష్ట్ర అవతరణ వేడుకలు
జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి
ఇందిరా మహిళా శక్తి పథకం కింద మండల మహిళా సమాఖ్య సభ్యులను బస్సులకు ఓనర్లను చేశామని మంత్రి వివరించారు. జిల్లా సమాఖ్య, 23 మండల సమాఖ్యలకు కలిపి మొత్తం 24 వాటికి ఆర్టీసీ బస్సుల కొనుగోలు కోసం రూ.7కోట్లను మంజూరు చేశామని మంత్రి తెలిపారు. సభ్యుల వాటా రూ. 8.64కోట్లతో బస్సులను కొనుగోలు చేశామని, వీటి ద్వారా సమాఖ్యలకు నెలకు దాదాపు రూ.70వేల చొప్పున ఆదాయం వస్తుందని తెలిపారు. 2025–26లో జిల్లాలో 12,396 స్వయం సహాయక సంఘాలకు రూ.887 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాలు అందించగా, 2026–27 సంవత్సరానికి జిల్లాలో 15,927 స్వయం సహాయక సంఘాలకు రూ.913 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాల లక్ష్యంగా నిర్ణయించినట్లు చెప్పారు. అనంతరం తెలంగాణ అమరవీరుల కుటుంబాలను సన్మానించారు. వివిధ శాఖలకు సంబంధించి స్టాళ్లను మంత్రి పరిశీలించారు.
సాక్షి, సిద్దిపేట: రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలనలో ప్రగతి వేగంగా ముందుకు సాగుతోందని, కాళోజీ కలలు కన్న తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్నామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మంగళవారం సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను మంత్రి పొన్నం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. తెలంగాణ అనేది నాలుగున్నర కోట్ల మంది ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అన్నారు. త్యాగాల పునాదులపై నిర్మితమైన తెలంగాణ, నేడు అభివృద్ధి, సంక్షేమానికి చిరునామాగా, ఆదర్శంగా నిలిచిందన్నారు.
పథకాల సద్వినియోగం కోసమే..
సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చి సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించడమే లక్ష్యంగా ‘ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. కార్యాలయాల పరిశుభ్రత, పెండింగ్ ఫైళ్ల పరిష్కారం చేపట్టామన్నారు. రోడ్డుభద్రత అవగాహన కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 508 రోడ్ సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేసి, 27,336 మందికి అవగాహన కల్పించినట్లు తెలిపారు.
ఆరోగ్యశ్రీలో 61 వేల మందికి ఉచిత వైద్య సేవలు
రాజీవ్ ఆరోగ్యశ్రీలో 61వేల మందికి ఉచితంగా వైద్య సేవలు అందాయని మంత్రి పొన్నం తెలిపారు. మహాలక్ష్మి పథకం ద్వారా జిల్లాలో 9.24కోట్ల మంది మహిళలు బస్సులలో ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకుని రూ.358 కోట్లు లబ్ధి పొందారన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద 61,094 మంది.. రూ. 166 కోట్ల విలువ చేసే ఉచిత వైద్య సేవలు పొందారన్నారు. జిల్లాలో 10,898 ఇందిరమ్మ ఇళ్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేయగా, 10,113 ఇళ్లు ప్రారంభమయ్యాయి. మహాలక్ష్మి పథకం కింద జిల్లాలో 1,79,883 మంది లబ్ధిదారులకు రూ.500 కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామన్నారు. ఇప్పటివరకు 7,53,962 గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసి, రూ.22.82 కోట్ల సబ్సిడీ నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. గృహజ్యోతి పథకంలో భాగంగా 2,05,499 విద్యుత్ వినియోగదారులకు ఉచిత విద్యుత్‌కు సంబంధించి రూ.163 కోట్ల సబ్సిడీని అందించినట్లు చెప్పారు.
ఖాళీ కుర్చీలే దర్శనం
ఉదయం 8గంటలకు జాతీయ పతాకావిష్కరణ కావడంతో జిల్లా ప్రజలు ఎవరూ చేరుకోలేదు. దీంతో ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. మంత్రి ప్రసంగం సమయంలో పలువురు జిల్లా అధికారులు, విలేకరులు, పోలీసులు తప్ప మిగతా వారు కన్పించలేదు. మంత్రి ప్రసంగం సైతం జిల్లాలో అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి పనులను పొందు పరచలేదని పలువురు చర్చించుకున్నారు. కార్యక్రమంలో కలెక్టర్ హైమావతి, సీపీ రష్మీ పెరుమాళ్, అదనపు కలెక్టర్ లక్ష్మి కిరణ్ ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేస్తున్న మంత్రి పొన్నం, కలెక్టర్, సీపీ తదితరులు
అభివృద్ధి, సంక్షేమమే ముఖ్యం


