చిన్నకోడూరు(సిద్దిపేట): ధాన్యం కొనుగోలు చేయాలంటూ రామంచ వద్ద సిద్దిపేట– సిరిసిల్ల రహదారిపై మంగళవారం రైతు లు ధర్నా నిర్వహించారు. రోడ్డుకు అడ్డంగా ధాన్యం ట్రాక్టర్లను పెట్టి ఆందోళన చేపట్టారు. రోడ్డుకు ఇరువైపులా ట్రాఫిక్ నిలిచిపోవడంతో ఎస్‌ఐ చంద్రమోహన్ అక్కడకు చేరుకుని రైతులతో మాట్లాడి వారిని శాంతింపజేశారు. రైతులు మాట్లాడుతూ నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసి మండుటెండల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
లారీల కోసం రాస్తారోకో..
తొగుట(దుబ్బాక): కొనుగోలు కేంద్రంలో తూకంవేసిన ధాన్యం బస్తాలు తరలించేందుకు వారం రోజులుగా లారీలు రాకపోవడంతో రైతులు ఆందోళనకు దిగారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు ఎదుట మంగళవారం రాస్తారోకో చేపట్టారు. వీరికి ప్రైవేట్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు పాగాల రాజిరెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ కుర్మ యాదగిరి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. సమస్యలు పరిష్కరించాల్సిన ఏఎంసీ పాలకవర్గం సైతం అడ్రస్ లేదన్నారు. వారం రోజుల క్రితం 4వేల బస్తాలు తూకం వేసి తరలించేందుకు సిద్ధంచేసినా లారీలు రావడలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఎఎస్‌ఐ రైతులకు సర్దిచెప్పి రాస్తారోకోను విరమింపజేశారు.


