● ప్రత్యేక గుర్తింపు వచ్చేలా పనిచేయండి ● అధికారులతో మంత్రి పొన్నం సమీక్ష
సిద్దిపేటరూరల్: ప్రత్యేక గుర్తింపు వచ్చేలా అధికారులు పనిచేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ హైమావతి, సీపీ రష్మీపెరుమాళ్‌తో కలిసి జిల్లా అధికారులతో సాధారణ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లి పేద ప్రజలకు అందించాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు. అదేవిధంగా పంట వైవిధ్యంపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని, వరికి బదులుగా పప్పు దినుసులు, నూనె గింజలు ఇతర వాణిజ్య పంటలు పండించేలా రైతులను సిద్ధం చేయాలన్నారు. జిల్లాకు లక్ష 50 వేల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం అవసరమని కానీ 50వేల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం మాత్రమే పండిస్తున్నారన్నారు. అవసరమైన సన్న రకం వరి విత్తనాలను రైతులకు సరఫరా చేయాలని అన్నారు. బడిబాట కార్యక్రమం నిర్వహించి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా పంట భూములలో ఇంకుడు గుంతల నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. కొత్త మండలాలలో ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపించాలని, తాగునీరు సరఫరాకు ఇబ్బంది కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్, అటవీ శాఖ అధికారి, ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.


