ఉద్యమకారులకు ‘గుర్తింపు’ నివ్వండి | - | Sakshi
Sakshi News home page

ఉద్యమకారులకు ‘గుర్తింపు’ నివ్వండి

Jun 3 2026 6:42 AM | Updated on Jun 3 2026 6:42 AM

హుస్నాబాద్‌: తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీలో అందరికీ అవకాశం కల్పించాలని హుస్నాబాద్‌ నియోజకవర్గ జేఏసీ కన్వీనర్‌ లక్ష్మారెడ్డి డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని మంగళవారం జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమకారులు ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్‌ చౌరస్తాలో మానవహారం నిర్వహించి మంత్రి క్యాంప్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. క్యాంప్‌ కార్యాలయం లోపలికి వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పోలీసులకు, ఉద్యమకారుల మధ్య తోపులాట జరిగింది. తర్వాత పరిమిత సంఖ్యలో అనుమతి ఇవ్వడంతో మంత్రి పీఏకు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాలను గుర్తించి న్యాయం చేయాలన్నారు. అర్హులైన ప్రతి ఉద్యమకారుడికి ఇంటి స్థలం ఇవ్వాలన్నారు. జీవన భృతి కోసం రూ.25వేల గౌరవ పెన్షన్‌ మంజూరు చేయాలన్నారు. సంక్షేమ పథకాల పర్యవేక్షణకు ఉద్యమకారుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో జేఏసీ కో ఆర్డినేటర్‌ వీరన్న యాదవ్‌, వివిధ పార్టీల నాయకులు వంగ వెంకట్రాంరెడ్డి, తిరుపతిరెడ్డి, గాదెపాక రవీందర్‌, మల్లికార్జున్‌ రెడ్డి తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement