● వానలు పడితే ఆగమే ● 1.20 లక్షల మెట్రిక్ టన్నులకుపైగా వడ్లు ఇంకా కొనుగోలు కేంద్రాల్లోనే ● ఆందోళన చెందుతున్న రైతాంగం
దుబ్బాక మార్కెట్ యార్డులో ధాన్యం రాశులు
ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులకు తిప్పలు తప్పడంలేదు. కొనుగోలు కేంద్రాల్లోనే నెలల తరబడి ధాన్యం కుప్పల వద్ద పడిగాపులు కాస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా రైతాంగం రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వ యంత్రాంగంలో చలనంలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 1.20 లక్షల మెట్రిక్ టన్నులకుపైగా వడ్లు ఇంకా కొనుగోలు కేంద్రాల్లోనే ఉండటం చూస్తుంటే కొనుగోళ్లు ఎంత నత్తనడకన సాగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. వర్షాలు కురిస్తే ధాన్యం నీటిపాలవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. – దుబ్బాక
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమై నెలన్నర రోజులకుపైగా అవుతోంది. కొనుగోళ్లు నత్తనడకన సాగుతుండటమే ఇందుకు కారణం. జిల్లా వ్యాప్తంగా 427 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 3.80 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. 45,782 మంది రైతులకు ఇప్పటి వరకు రూ.716 కోట్లు జమ చేశారు. ఈ యాసంగిలో జిల్లాలో 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు వస్తాయని అంచనా వేసి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. తీరా రోహిణి కార్తె ప్రవేశించి వారం రోజులు కావస్తున్నా ఇంకా 3.80 లక్షల మెట్రిక్ టన్నులే కొనుగోలు కావడం శోచనీయం. దీన్ని బట్టి చూస్తే ఇంకా 1.20 లక్షలకు పైగా మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అధికారులు మాత్రం కొనుగోలు ప్రక్రియ దగ్గర పడిందని, పొంతన లేని లెక్కలు చెబుతుండడం గమనార్హం.
నిత్యం ఆందోళనలు..
ధాన్యం కొనుగోలు చేయాలంటూ రోజూ రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేపడుతున్నారు. ఏ మండలంలో చూసినా ధర్నాలు, రాస్తారోకో చేస్తుండటం కనిపిస్తోంది. వానకాలం ప్రారంభమై వానలు పడితే మా పరిస్థితి ఏమిటీ అని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇంకా ఎన్ని రోజులు ఇక్కడే ఉండాలే.. ఎప్పుడు కొనుగోళ్లు పూర్తి చేస్తారు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై నా అధికార యంత్రాంగం మేల్కొని యుద్ధ ప్రతిపాదికన కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా చేతికాడి కూడు నేలపాలయ్యే ప్రమాదం పొంచి ఉంది.


