● మాజీమంత్రి హరీశ్‌రావు ● విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి యాదవుల సంక్షేమం పట్టడంలేదని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో యాదవ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో యాదవుల సంక్షేమానికి పెద్దపీట వేశామని అన్నారు. చట్టసభల్లో సైతం అవకాశం కల్పించామన్నారు. అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కేసీఆర్ బీసీ గురుకులాలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటల్లో తప్ప చేతల్లో లేదన్నారు. ప్రతి విద్యార్థి కష్టపడి చదివి తల్లిదండ్రులకు, చదువు చెప్పిన గురువులకు మంచి పేరు తేవాలన్నారు. చదువుకు కులం, పేదరికం అడ్డు కాదని కష్టపడి చదివితే ఏదైనా సాధించవచ్చన్నారు. ఈ పురస్కారాలు, అవార్డులు అందజేయడంతో విద్యార్థుల్లో నూతన ఉత్సాహం లభిస్తుందన్నారు.
ఎడ్యుకేషన్ ఫెయిర్‌తో ఉత్తమ భవిష్యత్
మంచి భవిష్యత్తుకు ఎడ్యుకేషన్ ఫెయిర్‌తో ఎంతో లబ్ధి చేకూరుతుందని ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఎడ్యుకేషన్ ఫెయిర్‌లో వివిధ విద్యా సంస్థలకు చెందిన స్టాళ్లను ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన హరీశ్‌రావు మాట్లాడుతూ మొదటి సారిగా సిద్దిపేటలో ఎడ్యుకేషన్ ఫెయిర్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఇంటర్, డిగ్రీ తరువాత ఏ నిర్ణయం తీసుకోలేక విద్యార్థులు సతమతమవుతారని అలాంటి వారికీ ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ ఎంతో మేలు చేస్తుందన్నారు. మన జీవితానికి విద్య పునాది అన్నారు. కొత్త సాంకేతికతలు, కొత్త అవకాశాలు వస్తున్నాయ న్నారు. వాటిని అందిపుచ్చుకోవడానికి విద్యార్థులు పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా విజ్ఞానం, విజ్ఞానశాస్త్రం, సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచుకోవాలన్నారు. అలాంటి అవకాశాలను ఈ ఎడ్యుకేషనల్ ఫెయిర్ అందిస్తుందని చెప్పారు.ఈ అవకాశాన్ని ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలన్నారు.
మరోసారి సమీక్షించుకోవాలి
కన్వర్ట్ క్రిస్టియన్లకు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు వర్తించవని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో అనేక మంది కన్వర్ట్ క్రిస్టియన్లు ఇబ్బందులు పడాల్సి వస్తోందని హరీశ్‌రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బేతస్థ ప్రార్థన మందిరం వార్షికోత్సవంలో హరీశ్‌రావు పాల్గొన్నారు. కన్వర్ట్ క్రిస్టియన్లకు రిజర్వేషన్‌లు వర్తించవని ఇచ్చిన సుప్రీం కోర్టు తీర్పును మరోసారి సమీక్షించుకోవాలన్నారు. కేసీఆర్ హయాంలో క్రిస్మస్ పండుగను రాష్ట్ర పండుగగా జరిపిన ఏకై క రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.


