విద్యాధరి సేవలో కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

విద్యాధరి సేవలో కలెక్టర్‌

Jun 1 2026 7:35 AM | Updated on Jun 1 2026 7:35 AM

వర్గల్‌(గజ్వేల్‌): ప్రసిద్ధమైన వర్గల్‌ విద్యాధరి క్షేత్రాన్ని ఆదివారం రాత్రి కలెక్టర్‌ హైమావతి సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ వేదపండిత పరివారం ఆమెకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించి, ఆశీస్సులు పొందారు. వేదపండితులు మహదాశీర్వచనం అందజేసి అమ్మవారి శేషవస్త్రంతో కలెక్టర్‌ను సత్కరించి, తీర్థప్రసాదాలు అందజేశారు.

దరఖాస్తుల ఆహ్వానం

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): స్కౌట్స్‌–గైడ్స్‌ ఆర్గనైజేషన్‌ లో పనిచేయడానికి స్కౌట్స్‌ మాస్టర్ల ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కమిషనర్‌ ఇస్సారపు రూయల్‌ రాజ్‌ ఆదివారం తెలిపారు. డిగ్రీ ఉత్తీర్ణత సాధించి, 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు కల్గిన అభ్యర్థులు అర్హులన్నారు. స్కాట్స్‌ మాస్టర్లకు నెలసరి వేతనం రూ.15వేలు ఉంటుందన్నారు. అభ్యర్థుల ఈ నెల 6న సాయంత్రంలోగా దరఖాస్తులు అందజేయాలన్నారు. పూర్తి వివరాలకు శివమ్స్‌ కాలనీ, కుషాల్‌ నగర్‌లో ఉన్న జిల్లా కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

ఎడ్ల లక్ష్మీకి పురస్కారం

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): ప్రముఖ రచయిత ఎడ్ల లక్ష్మీకి ‘షష్టిపూర్తి కలాలకు మాతృమూర్తి వందనం’ పురస్కారం లభించినట్లు, బాలసాహితీవేత్త ఉండ్రాళ్ల రాజేశం ఆదివారం తెలిపారు. అక్షరయాన్‌, అభిజ్ఞ భారత్‌ ఆర్గనైజేషన్‌ సంయుక్త నిర్వహణలో 70 ఏళ్లు పైబడిన రచయిత్రులకు ఈ పురస్కారాలను హైదరాబాద్‌ లో అందించినట్లు తెలిపారు. ఎడ్ల లక్ష్మీకి జిల్లా కవులు, రచయితలు అభినందనలు తెలిపారు.

కబడ్డీ లీగ్‌కు ఎంపిక

గజ్వేల్‌రూరల్‌: జిల్లా కబడ్డీ అసోసియేషన్‌కు చెందిన క్రీడాకారుడు లారెన్‌ ప్రో కబడ్డీ లీగ్‌కు ఎంపికయ్యారు. రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన సమావేశంలో లారెన్‌ ప్రోను రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్‌ అధ్యక్షుడు కాసాని వీరేశ్‌ ముదిరాజ్‌, ప్రధాన కార్యదర్శి మద్ది మహేందర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు సంతోష్‌ గుప్తా, ప్రధాన కార్యదర్శి శివకుమార్‌ అభినందించారు.

అగ్నివీర్‌కు ఇద్దరు ఎంపిక

సిద్దిపేటరూరల్‌: అగ్నివీర్‌కు రూరల్‌ మండలం రాఘవాపూర్‌కు చెందిన ఇద్దరు యువకులు ఎంపికయ్యారు. నిరుపేద కుటుంబానికి చెందిన జాప రాకేశ్‌ చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయాడు. తల్లి వెంకటవ్వ కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. రాకేశ్‌.. పెట్రోల్‌ బంకులో పనిచేస్తూ తల్లికి చేదోడు వాదోడుగా ఉంటూ అగ్నివీర్‌ ఉద్యోగ సాధనకై సిద్ధమయ్యారు. ఈ క్రమంలో 2025లో విడుదల చేసిన నోటిఫికేషన్‌ లో దరఖాస్తు చేసుకుని హన్మకొండలో జరిగిన పరీక్షలో పాల్గొన్నారు. అదేవిధంగా సాధారణ కుటుంబానికి చెందిన గ్యార లక్ష్మి, ఎల్లయ్య దంపతుల కుమారుడైన లోకేశ్‌ సైతం పరీక్ష రాశారు. శనివారం రాత్రి విడుదలైన అగ్నివీర్‌ పరీక్షా ఫలితాల్లో వీరు ఉత్తమ మార్కులు సాధించారు. వీరు భారత సైన్యంలోకి ఎంపిక కావడంతో గ్రామస్తులు అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement