ఇరవై రోజులవుతున్నా కొనరేం? | - | Sakshi
Sakshi News home page

ఇరవై రోజులవుతున్నా కొనరేం?

May 7 2026 9:38 AM | Updated on May 7 2026 9:38 AM

రైతుల ఇబ్బందులపై మంత్రి సీరియస్‌

హుస్నాబాద్‌: పట్టణంలోని ఆరపల్లె కొనుగోలు కేంద్రానికి ధాన్యం తెచ్చి 20 రోజులు గడుస్తున్నా కొనుగోళ్లు చేయడంలేదంటూ రైతులు మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం బుడిగ జంగాల కాలనీ రహదారిపై ధర్నా నిర్వహించారు. వీరికి మద్దతుగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్‌ బాబు, పార్టీ నాయకులు ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శంకర్‌ బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోళ్ల ప్రక్రియను జాప్యం చేస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నదని మండిపడ్డారు. మరో వైపు లారీల కొరత వల్ల కేంద్రాల వద్ద ధాన్యం నిలువలు పెరిగిపోతున్నాయన్నారు. స్థానిక ఎస్‌ఐ లక్ష్మారెడ్డి, సింగిల్‌ విండో సీఈఓ ప్రవీణ్‌ అక్కడికి చేరుకుని కొనుగోలు ప్రక్రియను వేగిరం చేయిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

మిల్లర్లపై చర్యలు తీసుకోవాలి

నంగునూరు(సిద్దిపేట): ధాన్యం కొనుగోలులో జాప్యం జరగకుండా చూడాలని, తాలు పేరిట దోపిడీకి పాల్పడుతున్న మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం ముండ్రాయి వద్ద రైతులు రాస్తారోకో నిర్వహించారు. రైతులు మాట్లాడుతూ ఇప్పటి వరకు గ్రామం నుంచి రెండు లారీల వడ్లు ముండ్రాయి మిల్లుకు తరలిస్తే తాలు పేరిట క్వింటాలుకు 5 కిలోల చొప్పున కోత విధించారన్నారు. మిల్లర్లను అడిగితే దురుసుగా మాట్లాడుతున్నారని, డీఎస్‌ఓకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు.

రహదారిపై రైతుల ధర్నా

బస్వాపూర్‌లో ఆకస్మిక తనిఖీ

కోహెడరూరల్‌(హుస్నాబాద్‌): ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగవద్దని, క్షేత్ర స్థాయిలో సమస్యలను వెంటనే ఎందుకు పరిష్కరించడంలేదని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మండలంలోని బస్వాపూర్‌ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించి కొనుగోలు తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలను మంత్రి దృష్టికి తెచ్చారు. స్పందించిన మంత్రి అక్కడికక్కడే కలెక్టర్‌ హైమవతికి ఫోన్‌ చేసి మాట్లాడారు.

Advertisement
 
Advertisement
Advertisement