చిన్నకోడూరు(సిద్దిపేట): మండల పరిధిలోని అల్లీపూర్ రేణుకా ఎల్లమ్మ దేవాలయ వార్షికోత్సవాలు సోమవారం వైభవంగా నిర్వహించారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమం నిర్వహించారు. పుట్టకు పూజలు చేయడంతో పాటు మహిళలు బోనాలు తీశారు. అలాగే ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
‘గేట్’కు ఉచిత కోచింగ్
హుస్నాబాద్: శాతవాహన యూనివర్సిటీ హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం గేట్ (గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్)పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎక్స్–ఐఈఎస్ (ఆల్ ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్) అభ్యర్థి చింతల రమేశ్ ఉపన్యసించారు. వచ్చే నెల ఒకటి నుంచి గేట్‌కు ఉచిత కోచింగ్ తరగతులు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. గేట్ సిద్ధత, సబ్జెక్ట్ ప్రణాళిక, సమయ నిర్వాహణతో పాటు ఉన్నత విద్య, ఉద్యోగ పరిశోధన అవకాశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ తిరుపతిరెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర
వర్గల్(గజ్వేల్): రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని వంటిమామిడి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాగనోల్ల విజయ అన్నారు. సోమవారం పీఏసీఎస్ పర్సన్ ఇంచార్జి శ్రీనివాస్‌రెడ్డి, సెక్రటరీ జితేందర్‌రెడ్డితో కలిసి ఆమె వర్గల్ మండలం తున్కిఖాల్సా, వేలూరు, నాచారం, మజీద్‌పల్లి, మైలారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు దళారుల బారిన పడొద్దన్నారు. సన్నధాన్యానికి ప్రభుత్వం రూ.500 బోనస్ ఇస్తుందని గుర్తుచేశారు. కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
పెండింగ్ బకాయిలివ్వండి
ఏబీవీపీ నాయకుల నిరాహార దీక్ష
సిద్దిపేటకమాన్: విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో సిద్దిపేట బస్టాండ్‌లోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, బస్టాండ్ వద్ద సోమవారం నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఎత్తివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందన్నారు. రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ద్వారా ఏడాదికి సుమారు 14లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేద మధ్యతరగతి విద్యార్థులు పలు కోర్సుల్లో చదువుకుంటున్నారని తెలిపారు. పెండింగ్ బకాయిలు విడుదల చేయాలన్నారు. విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడుతామన్నారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు విజయ్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
కోర్టు కార్యాలయం తరలింపు
గజ్వేల్‌రూరల్: పట్టణంలో ప్రస్తుతం ఉన్న జూనియర్ సివిల్ జడ్జీ కోర్టు కార్యాలయాన్ని తరలించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పట్టణంలో శాశ్వత కోర్టు భవన నిర్మాణం పూర్తయ్యే వరకు ఐవోసీ (ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్)లోగల బ్లాక్ – ఏలో తాత్కాలికంగా కోర్టు కార్యాలయం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ హైమావతి గజ్వేల్ ఆర్డీఓను ఆదేశించారు.


