మద్దూరు(హుస్నాబాద్): దూల్మిట్ట మండల కేంద్రంలోని సమస్యలపై ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డికి స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు విన్నవించారు. రోడ్డు విస్తరణ, రోడ్డు డివైడర్, సెంట్రల్ లైటింగ్ పనులు నిధులు లేక ఆగిపోవడంతో మాజీ జెడ్పీటీసీ గిరికొండల్ రెడ్డి, సర్పంచ్ లీల తదితరులు నగరంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. గ్రామంలో చాలా పనులు నిధులు లేక ఆగిపోయాయని, నిధులు మంజూరు చేసి గ్రామాభివృద్ధికి సహకరించాలని వారు కోరారు. అభివృద్ధికి సహకరిస్తాని ఎంపీ హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.
చక్కటి ఆహారంతోనే ఆరోగ్యం
సిద్దిపేటకమాన్: ప్రతి ఒక్కరూ చక్కటి ఆహార నియమాలు పాటిస్తూ వ్యాయామం చేయాలని ప్రభుత్వాస్పత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ చందర్, సీఎస్‌ఆర్‌ఎంఓ డాక్టర్ జ్యోతి అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్, ఆర్‌ఎంఓ డాక్టర్ శ్రావణితో కలిసి వైద్యాధికారులు మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆరోగ్యమే మహాభాగ్యమని.. ఆరోగ్యానికి మించిన సంపద లేదని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటేనే అన్ని పనులు చేయగలుగుతారని తెలిపారు. మద్యం, ధూమపానానికి దూరంగా ఉండాలని సూచించారు. ప్రతి మూడు, నాలుగు నెలలకోసారి వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అదేవిదంగా జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వాసుపత్రిలో లీగల్ అవేర్‌నెస్ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో ఆర్‌ఎంఓ వైద్యులు శ్రావణి ముదిరాజ్, సదానందం, న్యాయసేవా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
యువతకు విదేశీ
ఉపాధి అవకాశాలు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): నిరుద్యోగ మైనారిటీ యువత విదేశీ ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అఽధికారి నాగరాజమ్మ మంగళవారం పేర్కొన్నారు. రాష్ట్ర మైనారిటీ ఆర్థిక సంస్థ, శిక్షణ, ఉపాధి కార్యక్రమంలో భాగంగా మైనారిటీ నిరుద్యోగ యువతకు విదేశాలలో వివిధ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆస్ట్రేలియా, ఒమన్, జర్మనీ, ఖతర్, గ్రీస్‌లలో పురుషులకు, మహిళలకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు జిల్లా మైనార్టీ సంక్షేమఽశాఖ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
మందుబాబులకు జరిమానా
సిద్దిపేటకమాన్: మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వాహనదారులకు సిద్దిపేట కోర్టు జరిమానా విధించింది. సిద్దిపేట ట్రాఫిక్ సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని పలు ప్రాంతాల్లో సిబ్బందితో కలిసి నిర్వహించిన వాహన తనిఖీల్లో 17మంది పట్టుబడ్డారు. వారిని కోర్టులో హాజరుపర్చగా విచారణ జరిపిన న్యాయమూర్తి వారికి రూ.1,68,000 జరిమానా విధించినట్లు సీఐ తెలిపారు.
ఘనంగా రాజయ్య జయంతి
సిద్దిపేటజోన్: అంతర్జాతీయ చిత్రకారుడు కాపు రాజయ్య జయంతి మంగళవారం జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజయ్య సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కవులు రాజమౌళి, రాజేశం, రాజయ్య, సురేందర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.


