వైద్యాధికారులను, సిబ్బందిని అభినందించిన డీఎంహెచ్‌ఓ
సిద్దిపేటకమాన్: వైద్యారోగ్యశాఖ పరిధిలో ఉత్తమ సేవలందించిన జిల్లాలోని రెండు పీహెచ్‌సీలు, ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలకు రాష్ట్ర స్థాయి అవార్డులు వచ్చినట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ ధనరాజ్ తెలిపారు. ఈ సందర్భంగా వైద్యారోగ్యశాఖ అధికారులు, సిబ్బందిని ఆయన అభినందించారు. డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. జిల్లాలోని ఇందుప్రియాల్, రాయపోల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, చేర్యాల మండలంలోని పోతిరెడ్డిపల్లి, రాయపోల్ మండలం లింగారెడ్డిపల్లి, బెజ్జంకి ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు రాష్ట్ర స్థాయి అవార్డులకు ఎంపికై నట్లు తెలిపారు. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర వైద్యరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా ఉత్తమ ప్రతిభ అవార్డులు అందుకున్నట్లు డీఎంహెచ్‌ఓ తెలిపారు. వైద్యాధికారులు, ఎంఎల్‌హెచ్‌పీలు, ఏఎన్‌ఏంలకు అభినందనలు తెలిపారు. ఇతర ఆరోగ్య కేంద్రాలు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌లు కూడా ప్రజలకు మెరుగైన సేవలు అందించి రాష్ట్ర స్థాయిలో ముందుండాలని తెలిపారు.
దుబ్బాక ఏరియా ఆస్పత్రికి..
దుబ్బాక: ఉత్తమ వైద్యసేవల్లో దుబ్బాక ఆస్పత్రికి ఒకేసారి రాష్ట్రస్థాయిలో మూడు ఉత్తమ అవార్డులు వరించాయి. దుబ్బాక ఆస్పత్రి ఎన్‌క్వాస్, కాయకల్ప, ముస్కాన్ అవార్డులు దక్కాయి. మంగళవారం హైదరాబాద్‌లో మంత్రి దామోదర చేతుల మీదుగా ఆస్పత్రి సూపరింటెండెంట్ హేమరాజ్‌సింగ్ అవార్డులు అందుకున్నారు.


