సిద్దిపేటజోన్/నంగునూరు: సిద్దిపేటపై ఎలాంటి వివక్ష లేదు.. అన్ని నియోజకవర్గాలు మాకు సమానమే.. సిద్దిపేట అభివృద్ధి బాధ్యత నాదే.. అన్ని వర్గాలకూ అండగా ఉంటా..’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. మీ హయాంలో.. మా పాలనలో జరిగిన వివక్షపై లెక్కలు తీద్దామా? అందుకు సిద్ధమా? అంటూ పరోక్షంగా బీఆర్‌ఎస్ అగ్రనాయకులకు సవాల్ విసిరారు. ఆదివారం నర్మేటలో సీఎం రేవంత్.. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, వివేక్‌తో కలిసి ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని ప్రారంభించారు. ప్రారంభోత్సవ సభలో సీఎం మాట్లాడుతూ రాజకీయాలు ఎన్నికల వరకు మాత్రమే ఉండాలని, తరువాత అభివృద్ధికి అంకితమవుదామన్నారు. పార్టీలకు అతీతంగా ప్రజల కోసం పని చేద్దామని పరోక్షంగా బీఆర్‌ఎస్ అగ్రనాయకత్వానికి సూచించారు. వివక్ష ఉంటే ఇక్కడ ప్రారంభించిన ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని కొడంగల్‌కు తరలించేవాడినని అన్నారు. సీఎం హోదాలో కొడంగల్‌లో సైతం ఇలాంటి ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని మంత్రి తుమ్మలను ఇదే వేదిక ద్వారా కోరిన విషయాన్ని గుర్తు చేశారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్ భూసేకరణ విషయంలో ఏటిగడ్డ కిష్టాపూర్ భూనిర్వాసితులకు అండగా దీక్ష చేసినట్లు గుర్తు చేశారు. సీఎంగా సిద్దిపేటకు వచ్చానని 2029లో కూడా గెలిచి మళ్లీ వస్తానని, ఈ ప్రాంత అభివృద్ధికి నిధులు ఇస్తానన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా రైతుల్లో వాణిజ్య పంటల సాగు పట్ల చైతన్యం ఉందని, పసుపు, చెరుకు, కందులు, మొక్కజొన్న లాంటి పంటలను పండిస్తున్నారన్నారు. ఇదే స్ఫూర్తితో లాభాదాయక పంట ఆయిల్‌పామ్ ద్వారా వ్యవసాయ రంగంలో మార్పు రావాలని పిలుపునిచ్చారు.
రాజకీయాలు ఎన్నికల వరకే..
అన్ని వర్గాలకు అండగా ఉంటా
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
నర్మేటలో పామాయిల్
ఫ్యాక్టరీ ప్రారంభం


