సాక్షి, సిద్దిపేట: సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం అయిన తర్వాత రెండో సారి సిద్దిపేట నియోజకవర్గానికి వస్తున్నారు. ఈ సందర్భంగా పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. మధ్యాహ్నం 2.30గంటలకు నర్మేటలోని పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తారు. అక్కడే వర్చువల్‌గా పలువాటికి శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడనున్నారు. రూ.300 కోట్ల వ్యయంతో పామాయిల్ ఫ్యాక్టరీని అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించారు. గంటకు 120 టన్నుల పామాయిల్ గెలలను క్రష్ చేసి నూనె తీయనుంది.
ఉన్నతాధికారుల పర్యవేక్షణ
ఈనెల 19న రైతు మహోత్సవ ప్రారంభం సందర్భంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల పోటాపోటీ నినాదాలతో కొంత ఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ముందస్తు చర్యలలో భాగంగా ఐజీ చంద్రశేఖర్ నేతృత్వంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రారంభ ఏర్పాట్లను ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్, కలెక్టర్ హైమావతి, ఐజీ చంద్రశేఖర్, సీపీ రష్మీ పెరుమాళ్ పర్యవేక్షించారు. 900 మంది పోలీస్ సిబ్బంది, అధికారులతో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలను గుర్తించి ముందస్తుగా అరెస్ట్ చేసే అవకాశం ఉంది.
అభివృద్ధి పనులకు
మోక్షం కల్పించరూ..
సీఎం రేవంత్‌రెడ్డికి జిల్లా ప్రజల లేఖ
సిద్దిపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు అర్ధంతరంగా నిలిచిపోయి వెక్కిరిస్తున్నాయి. జిల్లాలో వెయ్యి పడకల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి, నర్సింగ్ కళాశాలకు స్వల్పంగా నిధులు కేటాయిస్తే అవి అందుబాటులోకి రానున్నాయి. అలాగే రంగనాయకసాగర్ వద్ద చేపట్టిన పర్యాటక అభివృద్ధి, కోమటిచెరువు శిల్పారామం, బీజేఆర్ చౌరస్తాలో మోడల్ మార్కెట్, వెటర్నరీ కళాశాల భవన నిర్మాణం పనులు సైతం మధ్యలోనే నిలిచిపోయాయి. 1000 పడకల ఆస్పత్రి నిర్మాణం పూర్తి అయితే సిద్దిపేట, కామారెడ్డి, సిరిసిల్ల, మెదక్ జిల్లాల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారనుంది. పర్యాటకంగా ఎంతో అభివృద్ధి పరిచేందుకు రూ.100 కోట్లతో రంగనాయకసాగర్ వద్ద వివిధ పనులను చేపట్టారు. ఆ పనులు మఽధ్యలో నిలిచిపోయాయి. నర్సింగ్ కళాశాల భవనం దాదాపు పూర్తి కావచ్చింది. నిధులు కేటాయిస్తే నిర్మాణం పూర్తి కానుంది. దీంతో నర్సింగ్ విద్యార్థుల ఇబ్బందులు తప్పనున్నాయి. సీఎం రాక సందర్భంగానైనా మోక్షం లభిస్తుందా? అని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వాలు మారినా అభివృద్ధిని నిలిపివేయకుండా కొనసాగించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
ఇట్లు
సిద్దిపేట ప్రజలు
జిల్లాలో పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు.. పోలీసుల పటిష్ట బందోబస్తు


