సంక్షేమ పద్దు | - | Sakshi
Sakshi News home page

సంక్షేమ పద్దు

Mar 21 2026 6:39 AM | Updated on Mar 21 2026 6:39 AM

బడ్జెట్‌లో జిల్లాకు ప్రత్యేక కేటాయింపుల్లేవ్‌

ట్రిపుల్‌ ఆర్‌కు రూ.1,525 కోట్లు..

రీజనల్‌ రింగ్‌ రోడ్‌ కోసం రూ. 1,525 కోట్లను కేటాయించారు. ఉత్తరభాగం పరిధిలో నర్సాపూర్‌ నుంచి తూప్రాన్‌, గజ్వేల్‌, జగదేవ్‌పూర్‌, భువనగిరి, చౌటుప్పల్‌ వరకు 161.2 కిలో మీటర్లు ఉంది. దక్షిణభాగం చౌటుప్పల్‌ లో ప్రారంభమై అమనగల్లు, షాద్‌నగర్‌, మీదుగా సంగారెడ్డి వరకు 189 కిలో మీటర్లు ఉండనుంది. దీని కోసం గత బడ్జెట్‌లలో సైతం నిధులు కేటాయించారు. ఈ సారి సైతం కేటాయించడంతో రీజినల్‌ రింగ్‌ రోడ్‌ పనులు మరింత వేగం పెరగనుంది.

సాక్షి, సిద్దిపేట: రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌ జిల్లా ప్రజలను నిరాశపరిచింది. జిల్లాకు ప్రత్యేకంగా కేటాయింపులు ఏమీ లేనప్పటికీ పలు నూతన పథకాల అమలుతో కొందరు లబ్ధిపొందనున్నారు. మరోవైపు బడ్జెట్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాకు మంజూరైన పశువైద్య కళాశాల నిర్మాణం పనులు రెండేళ్లుగా నిలిచిపోయాయి. మల్లన్నసాగర్‌, రంగనాయకసాగర్‌ నుంచి దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాల్లోని పంటలకు సాగు నీటిని అందించే కాలువలు లేకపోవడంతో సాగు నీటి ఇబ్బందులు తప్పడంలేదు. అలాగే గౌరవెల్లి రిజర్వాయర్‌ కాలువల నిర్మాణం కావాల్సి ఉంది. దుబ్బాక, చేర్యాల రెవెన్యూ డివిజన్లు కావాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. జిల్లాకు నిధులు కేటాయించకపోవడంతో ప్రజలు నిరాశ చెందారు.

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని వర్తింపజేయాలని రాష్ట్ర బడ్జెట్‌లో రూ.4వేల కోట్లను కేటాయించారు. జిల్లా వ్యాప్తంగా 3,33,332 కుటుంబాలుండగా వారికి జీవిత బీమా వర్తించనుంది. దీంతో కుటుంబాలకు రూ.5లక్షల బీమా ఉండనుంది. కుటుంబంలో ఎవరైనా మరణిస్తే వారికి ఆర్థికంగా భరోసా లభించనుంది.

రాజీవ్‌ యువ వికాసానికి మోక్షం

రాజీవ్‌ యువ వికాసానికి ఎట్టకేలకు మోక్షం కలగనుంది. నిరుద్యోగ యువత ఉపాధి కోసం ఆర్థిక భరోసా కల్పించేందుకు రాజీవ్‌ యువ వికాసం పథకం తీసుకవచ్చింది. అందులో భాగంగా యువత నుంచి దరఖాస్తులను స్వీకరించారు. దీని కోసం జిల్లా వ్యాప్తంగా 59వేల మంది యువత దరఖాస్తు చేసుకున్నారు. మొదట రూ.50వేల వారికి ఇవ్వాలని గతంలో నిర్ణయించినప్పటికీ ఇవ్వలేదు.

యంగ్‌ ఇండియా స్కూల్స్‌

నియోజకవర్గానికి ఒక యంగ్‌ ఇండియా స్కూల్‌ను ఏర్పాటు చేయాలని గతంలోనే ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం రూ.5వేల కోట్లను బడ్జెట్‌లో కేటాయించారు. ఇప్పటికే హుస్నాబాద్‌ నియోజకవర్గానికి సంబంధించి రూ.250 కోట్ల వ్యయంతో కోహెడలో నిర్మాణం జరుగుతుంది. గజ్వేల్‌ నియోజకవర్గానికి సంబంధించి కొండపాకలో యంగ్‌ ఇండియా స్కూల్‌ను నిర్మించనున్నారు. ఇప్పటికే స్థలం గుర్తించారు. ఈ నెల 22న సీఎం చేతుల మీదుగా నర్మేటలోనే శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. అలాగే దుబ్బాక, సిద్దిపేటలలో సైతం రానుంది.

పట్టణాభివృద్ధికి పెద్దపీట

జిల్లాలోని పట్టణాలు అభివృద్ధి చెందనున్నాయి. పట్టణాభివృద్ధికి రూ.17,907 కోట్లను బడ్జెట్‌లో కేటాయించారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలలో 115 వార్డులకు సైతం నిధులు రానున్నాయి. అలాగే పల్లెల అభివృద్ధి కోసం రూ.33, 688 కోట్లను కేటాయించగా జిల్లాలోని 508 గ్రామ పంచాయతీలకు నిధుల వరద పారనుంది.

విద్యార్థులకు అల్పాహారం

ప్రీ ప్రై మరీ నుంచి ఇంటర్‌ వరకు 1.10లక్ష మంది విద్యార్థులకు ఇక అల్పాహారం అందించనున్నారు. దీంతో విద్యార్థులు ఉదయం పాఠశాలకు రాగానే అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందించనున్నారు. అలాగే ఇంటర్‌ విద్యార్థులకు సైతం భోజనం అందించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 20వేల మంది విద్యార్థులకు అందనుంది. ఐటీఐ విద్యార్థులకు రూ.2వేల ఉపకారవేతనం అందనుంది.

ఉద్యోగులకు ఆరోగ్య భరోసా

ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నగదు రహిత ఆరోగ్య భద్రతా పథకం వర్తింపజేయనున్నారు. ఇందు కోసం ప్రతి ఉద్యోగికి డిజిటల్‌ హెల్త్‌ కార్డును అందించనున్నారు.

పీఆర్‌సీ ప్రస్తావన ఏదీ?

రాష్ట్ర బడ్జెట్‌లో పీఆర్‌సీ ప్రస్తావన లేకపోవడంతో శోచనీయం. ఉద్యోగ ఉపాధ్యాయులకు ఆరోగ్య పథకం ప్రవేశపెట్టడం హర్షణీయం. నగదు రహిత వైద్య సేవలను వెంటనే ప్రారంభించాలి. పేదవాళ్లకు సరైన విద్య అందించాలంటే కామన్‌ స్కూల్‌ విధానం తీసుకురావాలి. బడ్జెట్‌లో విద్యాశాఖకు కేవలం 8.2శాతం మాత్రమే నిధులు కేటాయించారు.

– ఆదరాసుపల్లి శశిధర్‌,

పీఆర్‌టీయు జిల్లా ప్రధాన కార్యదర్శిమిశ్రమ బడ్జెట్‌

ది మిశ్రమ బడ్జెట్‌. ప్రజలకు ఆశించిన ప్రయోజనాలు లేవు. ముఖ్యంగా పెన్షన్ల పెంపు, గీతకార్మికులకు, యాదవులు, ముదిరాజ్‌, చేనేత కార్మికులకు వంటి వత్తి సంఘాలకు బడ్జెట్‌లో ప్రస్తావన లేదు. బడ్జెట్‌ కేవలం అసెంబ్లీ ప్రసంగాలకు పరిమితం కాకుండా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తోడ్పడేలా ఉండాలి.

– మంద పవన్‌, జిల్లా కార్యదర్శి, సీపీఐప్రజాపాలనకు నిదర్శనం

కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ప్రజాపాలనపై ప్రజలు పెట్టుకున్న నమ్మకానికి అనుగుణంగా ఉంది. ఆరు గ్యారంటీలతో పాటు విద్యార్థులకు అల్పాహారం అందిచడం మంచిది. అలాగే కుటుంబానికి భరోసాను కల్పించేందుకు బీమా పథకాన్ని వర్తింపజేయనున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అంకెల్లో కాకుండా చేతుల్లో చేసి చూపిస్తుంది. సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారని, ఆయనకు ప్రజల ఆశీర్వాదం తప్పక ఉంటుంది.

– అత్తు ఇమామ్‌, పట్టణ అధ్యక్షుడు, కాంగ్రెస్‌ కమిటీ

నిలిచిపోయిన అభివృద్ధి పనులపై దృష్టి సారించని రాష్ట్రం

ఇందిరమ్మ జీవిత బీమాతో 3.3లక్షల కుటుంబాలకు భరోసా

రాజీవ్‌ యువ వికాసంలో 59వేల దరఖాస్తులకు మోక్షం

సర్వత్రా భిన్నాభిప్రాయాలు మరిచిన రెవెన్యూ డివిజన్ల హామీలు

నూతన పథకాల అమలుతో కొందరికి మేలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement