భారీ సంఖ్యలో తరలివచ్చిన రైతులు
నంగునూరు(సిద్దిపేట): నర్మేట ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన స్టాళ్లు అన్నదాతలను ఆకట్టుకుంటున్నాయి. ఉద్యాన, ఇరిగేషన్, మార్క్‌ఫెడ్, వ్యయసాయ, పట్టు పరిశ్రమ, పశుసంవర్ధక, మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆసక్తిగా పరిశీలించారు. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, వరంగల్, నల్లగొండ, జనగాం, కామారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల నుంచి వచ్చిన రైతులు ఒక్కో స్టాల్ తిరుగుతూ పనిముట్లు, పంటసాగుపై ఆరా తీశారు. ఒక్కో స్టాల్ వద్ద ఆయా కంపెనీల ప్రతినిధులు రైతులకు అవగాహన కల్పిస్తూ ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలను వివరించారు.
ఆయిల్‌పామ్ సాగు తోపాటు బిందు సేద్యానికి ప్రాధాన్యత పెరగడంతో స్టాల్‌లో ఏర్పాటు చేసిన డ్రిప్ పరికరాలను అన్నదాతలు ఆసక్తిగా గమనించారు. ఆధునిక పద్ధతులు, మొక్కలు నాటే విధానం, మొక్కల మధ్య ఉంచాల్సిన దూరాన్ని రైతులకు వివరించారు. ఎరువులు, మందులు డ్రిప్ ద్వారా వదలడం ఎలాగో ప్రదర్శిస్తూ వివరించారు.
తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సౌర విద్యుత్ తయారీ, విద్యుత్ సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం పూర్తి సబ్సిడీ అను రైతులకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్ట్ కింద 80 గ్రామాలను ఎంపిక చేసి 6 నెలల్లోపు 16,800 సోలార్ విద్యుత్ సెట్టులను బిగించే ప్రాజెక్ట్ నడుస్తోందని సంస్థ ప్రతినిధులు రవీందర్, వినోద్ వివరించారు. దీనికి రైతుల నుంచి మంచి స్పందన లబించడంతో త్వరలోనే రాాష్ట్ర అమలు చేస్తారని వారు వివరించారు.
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వ విద్యాలయం విద్యార్థులు ఆధుక వ్యవసాయం, స్వయం ఉపాధిపై ఏర్పాటు చేసిన ప్రదర్శన మహిళలు ఆసక్తిగా గమనించారు. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పుట్టగొడుగు, మిల్లేట్ పంటలు, యూనియర్సీటిలో సృష్టిస్తున్న కొత్త వంగడాలు, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు గడించే పంటలపై విద్యార్థులు అవగాహక కల్పించారు.
ఆకట్టుకున్న పాల యంత్రం
పీవీ నరసింహారావు తెలంగాణ యూనివర్సిటీ కాలేజీ విద్యార్థులు విద్యుత్‌తో నడిచే మీగడ తయారీ యంత్రంలో పాలు పోసి చేసే విధానాన్ని ప్రదర్శించారు. యంత్రంలో పోసిన పాలను వివిధ రూపాల్లో వేడి చేయడం ద్వారా గంటలో పెరుగు, నెయ్యి, పాలకోవ, మజ్జిగ, పన్నీర్, మిల్క్‌పౌడర్, జున్ను పాల ఉత్పత్తులను ఏలా తయారు చేయవచ్చో వివరించారు. చిన్న పరిశ్రమలు పెట్టుకునే వారికి ఎంతో ఉపయోగంగా ఉంటుందని కళాశాల విద్యార్థి రైతులకు వివరించారు.
ఫ్లెక్సీల తొలగింపు
నర్మేట ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీలో రైతు మహోత్సవం ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన గొడవ వివాదాస్పదంగా మారింది. శుక్రవారం ఉన్నత స్థాయి అధికారులు ఫ్యాక్టరీని సందర్శించి పరిస్థితులపై సమీక్షించారు. ప్రోటోకాల్ పాటించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈమేరకు ఫ్యాక్టరీ ఆవరణలో కట్టిన ఫ్లెక్సీలను సిబ్బంది తొలగించారు.


