నర్మెట్ట: సిద్ధిపేట జిల్లా నర్మెట్టలో సీఎం రేవంత్ పర్యటనలో భాగంగా ఆయిల్‌ఫామ్ ప్యాక్టరీని ప్రారంభించారు. ఈ మేరకు రైతు భరోసా నిధులను విడుదల చేశారు సీఎం రేవంత్. దీనిలో భాగంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘ 70 లక్షల మందికి రైతు భరోసా నిధులను జమ చేశాం. రైతును రాజును చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నం చేస్తోంది. పంటలకు మద్దతు ధరతో పాటు రూ. 500 బోనస్‌గా ఇస్తాం. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తున్నాం.
2029లో సిద్ధిపేట నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేను గెలిపిస్తే మంత్రిని చేస్తా. 1984 నుంచి 2029 వరకూ ఇక్కడ ఒకే కుటుంబం అధికారంలో ఉంది. 2029 మళ్లీ వస్తాం.. సిద్ధిపేటలో మళ్లీ సమావేశం పెడతాం. కొంతమంది అభివృద్ధికి అడ్డుపడుతున్నారు. ప్రభుత్వానికి ప్రతిపక్షాలు సూచనలు చేయాలి. అభివృద్ధికి అడ్డుపడతామంటే ఎలా?, చెట్టుకు పట్టిన పురుగును ఎలా వదిలించాలో తెలుసు. అన్ని నియోజకవర్గాలను సమాన దృష్టితో చూస్తాం’ అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.
సీఎం రేవంత్ కామెంట్స్..
‘రైతు భరోసాకి 3600 కోట్ల రూపాయలను 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో వేశాము. రేపు మీ ఖాతాల్లో డబ్బులు పడతాయి. మరో 45 రోజుల్లో రైతు భరోసా అందరికి వస్తుంది. ఉగాది రోజున ఇందిరమ్మ చీర ఇస్తే నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన అక్కలకు కృతజ్ఞతలు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు అన్న నానుడి నిజం. అందుకే రైతు పక్షపాతిగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుంది. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధరతో పాటు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాం. 114 నెలలు సీఎంగా కేసీఆర్ ఉన్నారు. రైతుల కోసం రూ. 2533 కోట్లు ప్రతి నెల కేసీఆర్ ప్రభుత్వం ఖర్చు చేసింది. 28 నెలల్లో ప్రతి నెల రూ. 5500 కోట్ల రూపాయలు రైతు సంక్షేమం కోసం ఖర్చు చేస్తున్నాం. తుపాన్‌కి కామారెడ్డి ప్రాంతాల్లో పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. రైతుకి పంట నష్టం జరిగితే ఎకరానికి 10 వేల పరిహారం ఇచ్చాము. ఈ 28 నెలల్లో రైతుల కోసం లక్షా 40 వేల కోట్లు ఖర్చు చేశాం’ అని అన్నారు.
సీఎం రేవంత్ పర్యటనపై బీఆర్‌ఎస్‌వీ నిరసన
సీఎం రేవంత్ నర్మెట్ట పర్యటనపై బీఆర్‌ఎస్‌వీ(బీఆర్‌ఎస్ విద్యార్ధి విభాగం) నిరసన వ్యక్తం చేసింది. ఫ్లకార్డులు ప్రదర్శించి సిద్ధిపేట అభివృద్ధి ఏది అంటూ నిరసన తెలిసింది. సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు.. కటింగ్ మాస్టర్ అంటూ ఫ్లకార్డులను బీఆర్‌ఎస్‌వీ ప్రదర్శించింది. సిద్ధిపేట నియోజకవర్గానికి నిధులేవి అని ప్రశ్నించింది. సిద్ధిపేట అభివృద్ధిపై వివక్ష అంటూ ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేసింది.


