
● ఎన్నికల షెడ్యూల్ విడుదల ● అక్టోబర్ 23, 27తేదీల్లో ఎ
జిల్లాలోని గ్రామ పంచాయతీ(సర్పంచ్), మండల, జిల్లా ప్రాదేశిక సభ్యుల (ఎంపీటీసీ, జెడ్పీటీసీ) స్థానాలకు విడతల వారీగా ఎన్నికలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 23, 27 తేదీల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు పోలింగ్ జరుగనుంది. వాటికి సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ, ఎన్నికల ఫలితాలు నవంబర్11న విడుదల కానున్నాయి. అదేవిధంగా సర్పంచ్ ఎన్నికలను అక్టోబర్ 31, నవంబర్4, 8 తేదీల్లో మూడు విడతలుగా నిర్వహించనున్నారు. వాటికి సంబంధించిన ఓట్ల లెక్కింపు, ఫలితాలను పోలింగ్ రోజనే జరిగేలా షెడ్యూల్ ఖరారు చేశారు.
జెడ్పీటీసీ 26, ఎంపీటీసీ 230..
జిల్లాలోని 26 జెడ్పీటీసీ స్థానాలు, 230 ఎంపీటీసీ స్థానాలతో పాటు 508 గ్రామ సర్పంచ్ స్థానాలకు, 4508 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి సంసిద్ధమై పలుమార్లు సమీక్షలు నిర్వహించారు. ఇదే క్రమంలో ఈనెల 27న జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ రిజర్వేషన్ గెజిట్ జిల్లా యంత్రాంగం అధికారికంగా విడుదల చేసింది.
విడతల వారీగా ఎన్నికలు..
జిల్లాలోని 26 జెడ్పీటీసీ, 230 ఎంపీటీసీ స్థానాల ఎన్నికలను అక్టోబర్ 23, 27 తేదీల్లో నిర్వహించనున్నారు. మొదటి విడతల్లో 15మండలాల్లో, రెండో విడతలో 11 మండలాల వారీగా ప్రతిపాదనలు అందజేసినట్టు సమాచారం. 508 పంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో రెవెన్యూ డివిజన్ వారీగా ప్రతిపాదనలు సమర్పించినట్లు సమాచారం.
23, 27 తేదీల్లో పోలింగ్..
జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాలకు జరిగే ఎన్నికలకు.. మొదటి విడత షెడ్యూల్ అక్టోబర్ 9న ఓటర్ల జాబితా, 11న అభ్యర్థుల నామినేషన్ తుది గడువు, 15న అభ్యర్థుల తుది జాబితా విడుదల, అక్టోబర్ 23న ఉదయం7నుంచి సాయంత్రం5 వరకు పోలింగ్, నవంబర్ 11న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన వెలువడనుంది. అదేవిధంగా రెండో విడత షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 13న ఓటర్ల జాబితా విడుదల, 15 నామినేషన్ దాఖలు చివరి గడువు, 19న అభ్యర్థుల తుది జాబితా ప్రకటన, 27న పోలింగ్ జరగనుంది.
మూడు విడతల్లో..
జిల్లాలోని 508 సర్పంచ్, 4,508 వార్డు సభ్యుల స్థానాలకు మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 31, నవంబర్ 4, 8 తేదీల్లో పంచాయతీ పోలింగ్, అదే రోజు ఫలితాలు విడుదల అవుతాయి. ఈ క్రమంలో మొదటి విడత షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 17న, రెండో విడత 21న, మూడో విడత 25న ఓటర్ల తుది జాబితా విడుదల చేసి ఎన్నికల ప్రక్రియ కొనసాగించనున్నారు.
ఎన్నికలు సాఫీగా జరిగేలా చర్యలు: కలెక్టర్ హైమావతి
సిద్దిపేటరూరల్: స్థానిక సంస్థల ఎన్నికలు సాఫీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ హైమావతి తెలిపారు. సోమవారం రాష్ట్ర ఎన్నికల అధికారి రాణికుముదిని స్థానిక సంస్థల ఎన్నికల నియమావళి అమలుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ నోడల్ అధికారులను నియమించామన్నారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘన జరగకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్, జెడ్పీ సీఈఓ రమేష్, పంచాయతీ అధికారి దేవకీదేవి, డీఆర్డీఓ, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

● ఎన్నికల షెడ్యూల్ విడుదల ● అక్టోబర్ 23, 27తేదీల్లో ఎ