
పశువైద్యాధికారిపై వేటు
నూతనంగా కొండల్‌రెడ్డి నియామకం
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లా ఇన్‌చార్జి పశువైద్య, పశు సంవర్థకశాఖ అధికారిగా కొండల్‌రెడ్డిని నియమిస్తూ డైరెక్టర్ ఆఫ్ వెటర్నరీ అండ్ ఎనిమల్ హస్బెండరీ సూపరింటెండెంట్ పూర్ణిమ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. నాగపూర్ణచందర్‌రావు విధుల నిర్వహణలో నిర్లక్ష్యం, అవినీతి తదితర అంశాలపై వరుసగా సాక్షి దినపత్రికలో వచ్చిన కథనాలపై అధికారులు స్పందించారు. క్షేత్రస్థాయిలో విచారించి నాగపూర్ణచందర్‌రావును బాధ్యతల నుంచి తొలగించారు.
ప్రజావాణి రద్దు
సిద్దిపేటరూరల్: కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ హైమావతి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రజావాణిని నిలిపివేసి, కోడ్ ముగిసిన తర్వాత నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని సూచించారు.
బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిద్దాం
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): బాలకార్మిక వ్యవస్థను నిర్మూలిద్దామని, బాలల హక్కుల ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్ చంద్ర బోస్ అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ ‘విద్య నా హక్కు. బాల కార్మిక వ్యవస్థను అంతం చేద్దాం’ అని నినాదంతో ముందుకు వెళదామన్నారు. గత ప్రభుత్వం హయాంలో మూసివేసిన ఆరు వేల పాఠశాలలను తెరిపించాలన్నారు. రాష్ట్ర బడ్జెట్లో అధిక నిధులను విద్య కోసం కేటాయించాలన్నారు.
కవికి కీర్తి రత్న పురస్కారం
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లాకు చెందిన ప్రముఖ కవి వెంకటేశం కీర్తి రత్న పురస్కారం అందుకున్నట్లు, బాలసాహితీవేత్త ఉండ్రాళ్ల రాజేశం తెలిపారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ‘అందమైనది నాదేశం’ గేయానికి గాను భ వాని సాహిత్య వేదిక నిర్వాహకులు కీర్తి రత్న పురస్కారంతో పాటుగా ఘనంగా సన్మానించారన్నారు. వెంకటేశంకు జిల్లా కవులు బస్వరాజ్‌కుమార్, కాల్వ రాజయ్య, కోణం పర్శరాములు, తదితరులు అభినందనలు తెలిపారు.
ఎమ్మెల్యే హరీశ్‌రావుకు ఆహ్వానం
సిద్దిపేటజోన్: సిద్దిపేట బల్దియా పరిధిలో రంగధాంపల్లి హనుమాన్ దేవాలయం వద్ద జరిగే దసరా వేడుకలకు హాజరుకావాలని ప్రతినిధులు సోమవారం ఎమ్మెల్యే హరీశ్‌రావును కలిసి ఆహ్వానించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా దసరా ఏర్పాట్లు గూర్చి అరా తీశారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో వార్డు ప్రతినిధులు తిరుమల్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కనకయ్య, ఐలయ్య, తదితరులు పాల్గొన్నారు.
జోరు తగ్గని మంజీరా
పాపన్నపేట(మెదక్): మంజీరా నది వరదలు సోమవారం సైతం కొనసాగుతున్నాయి. ఘనపురం అనకట్టపై నుంచి సుమారు 1.06 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవిహిస్తోంది. దీంతో దుర్గమ్మ ఆలయం జలదిగ్బంధంలోనే ఉంది. అయితే ఎల్లాపూర్ బ్రిడ్జి, ఏడుపాయల బ్రిడ్జిపై నీటి ప్రవాహం తగ్గడంతో వాహనాల రాకపోకలు ప్రారంభం అయ్యాయి.

పశువైద్యాధికారిపై వేటు