
పుస్తక రూపిణి.. వివేకధాత్రి
వర్గల్ సరస్వతిదేవి నిజరూపదర్శనం
● వైభవంగా ‘మూల’ మహోత్సవం ● లక్ష పుష్పార్చన, మహా పుస్తకపూజ ● భారీగా చిన్నారులకు అక్షరాభ్యాసాలు
వర్గల్(గజ్వేల్): పుస్తక రూపిణి..వివేకధాత్రి.. విద్యాసరస్వతిదేవి నిజరూప దర్శనం భక్తజనావళిని మంత్రముగ్ధులను చేసింది. శంభుని కొండ అమ్మవారి స్మరణతో మార్మోగింది. విశేషాభరణాలు, నవరత్న మణిమయ స్వర్ణకిరీటంతో పుస్తకరూపిణి దివ్యదర్శనం..ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లిన ఈ అపూర్వఘట్టం సోమవారం వర్గల్ క్షేత్రంలో మూల మహోత్సవం సందర్భంగా ఆవిష్కృతమైంది. పీఠాధిపతులు విద్యాశంకరభారతి స్వామి, మాధవానందసరస్వతి స్వామి, ఆలయ వ్యవస్థాపక చైర్మన్ చంద్రశేఖరసిద్ధాంతి ఆధ్వర్యంలో మూల నక్షత్ర వేడుకలు కొనసాగాయి. వేదమంత్రోచ్ఛరణల మధ్య భక్తజన సామూహిక లక్ష పుష్పార్చన, మహాపుస్తక పూజ నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజామునుంచే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పోటెత్తారు.
పూర్ణకుంభస్వాగతం
క్షేత్రం సందర్శించిన పుష్పగిరి, రంగంపేట పీఠాధిపతులు విద్యాశంకర భారతి స్వామి, మాధవానంద సరస్వతి స్వామిలకు ఆలయ వేదపండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అభిషేకాది పూజలు నిర్వహించి అమ్మవారి సేవలో తరించారు. భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.
3,000పైగా అక్షర స్వీకారాలు
మూల మహోత్సవం సందర్భంగా సరస్వతిమాత సన్నిధిలో చిన్నారుల అక్షరాభ్యాసాల సందడి కొనసాగింది. 3000 పైగా చిన్నారులు అక్షరస్వీకారాలు చేశారని ఆలయ వర్గాలు తెలిపాయి.

పుస్తక రూపిణి.. వివేకధాత్రి