
ఊరెళ్తున్నారా?.. జర భద్రం
తాళాలు వేసిన ఇళ్లే దుండగుల టార్గెట్ అపరిచిత వ్యక్తులపై నిఘా.. ముందస్తు సమాచారం తప్పనిసరి పండుగల వేళ పోలీసుల సూచనలు
తాళం వేసిన ఇంటి ఎదుట వరండాలో లైట్లు వెలిగేలా ఏర్పాటు చేసుకోవాలి.
సీసీ కెమరాలు ఉన్న వారు పనిచేస్తున్నాయో లేదో చెక్ చేసుకోవాలి. లేని వారు ఏర్పాటు చేసుకోవాలి.
ఎప్పుడు ఊరెళ్తున్నారు? తిరిగి ఎప్పుడు వస్తారో వంటి వివరాలు, చిరునామా, ఫోన్ నంబర్‌ను పోలీసు స్టేషన్‌లో తెలియజేస్తే ఆ ఏరియాలో మరింత గస్తీ పెంచే అవకాశం ఉంటుంది.
కాలనీలో గుర్తు తెలియని, అపరిచిత వ్యక్తులు కనిపిస్తే అప్రమత్తంగా ఉండాలి.
అర్ధరాత్రి నుంచి వాచ్‌మెన్‌లను అప్రమత్తంగా ఉండాలని తెలపాలి.
బంగారం, నగదు, విలువైన వస్తువులు బ్యాంకు లాకర్‌లో భద్రపర్చుకోవాలి.
అనుమానిత వ్యక్తుల కదలికలపై డయల్ 100 లేదా సంబంధిత పోలీసులకు సమాచారం తెలపాలి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
సిద్దిపేటకమాన్: బతుకమ్మ, దసరా పండుగల సెలవులు వచ్చాయి. వివిధ రకాల పనులు, ఉద్యోగ, వ్యాపార రీత్యా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, వ్యాపారులు, పట్టణాల్లో స్థిరపడ్డారు. వరుస సెలువల నేపథ్యంలో పట్టణాల నుంచి తమ సొంత ఊర్ల బాట పట్టారు. ఇలాంటి సమయంలోనే దుండగులు తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడే అవకాశం ఉంది. నెల రోజుల క్రితం సిద్దిపేటలో తాళం వేసిన షెటర్లను ధ్వంసం చేసి చోరీలకు పాల్పడిన నిందితులను సీసీ పుటేజీ ఆధారంగా గుర్తించి అరెస్టు చేశారు. ఇలాంటి ఘటనలను దృష్టిలో ఉంచుకుని ఇంటికి తాళం వేసి స్వగ్రామాలకు వెళ్లే వారు ముందస్తు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు.
బంగారం, నగదు ఇంట్లో ఉంచకూడదు
పండుగ సెలవుల్లో ఇంటికి తాళం వేసి ఊరెళ్తే.. ఇంట్లో బంగారు ఆభరణాలు, నగదు, విలువైన వస్తువులు ఉంచకూడదు. బ్యాంకు లాకర్‌లో భ్రదపర్చుకోవడం ఉత్తమం. పగటి సమయంలో గుర్తు తెలియని దుండగులు రెక్కీ నిర్వహించి తాళం వేసిన ఇళ్లను గుర్తించి, టార్గెట్ చేసుకుని ఇంట్లోని బంగారం, వెండి, నగదు దోచుకెళ్తున్నారు. ఈ ఏడాది పట్టణంతో పాటు జిల్లా వ్యాప్తంగా పలు తాళం వేసిన ఇళ్లు, దుకాణాల షెటర్లు ధ్వంసం చేసి దుండగులు చోరీకి పాల్పడ్డారు.
ఇంటికి తాళం వేసి వెళ్తే అప్రమత్తంగా ఉండాలి
సమాచారం ఇవ్వాలి
పండుగల సెలవుల వేళ జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వరుస సెలవుల నేపథ్యంలో ఇళ్లకు తాళం వేసి ఊరెళ్లే వారు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలి. బంగారు ఆభరణాలు, నగదు, విలువైన వస్తువులు బ్యాంకు లాకర్లలో భద్రపర్చుకోవాలి. దొంగతనాలు జరగకుండా పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశాం.
– సీహెచ్ కుశాల్కర్, అదనపు డీసీపీ అడ్మిన్
రాత్రి వేళల్లో గస్తీ ముమ్మరం
వరుస సెలవుల నేపథ్యంలో పట్టణంలో, కాలనీల్లో రాత్రి వేళల్లో బ్లూకోల్ట్ సిబ్బందితో నిరంతరం నిఘా ఏర్పాటు చేశాం. అనుమానాస్పద వ్యక్తులను ఫింగర్ ఫ్రింట్ డివైజ్‌తో పరిశీలించనున్నాం. ప్రజలు సంతోషంగా బతుకమ్మ, దసరా పండగను జరుపుకోవాలి.
– వాసుదేవరావు, సిద్దిపేట వన్ టౌన్ సీఐ

ఊరెళ్తున్నారా?.. జర భద్రం

ఊరెళ్తున్నారా?.. జర భద్రం