
ఉత్కంఠకు తెర
జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్‌ల రిజర్వేన్లు ఖరారు
సాక్షి, సిద్దిపేట: స్థానిక సంస్థల రిజర్వేషన్ల ఉత్కంఠకు తెర పడింది. జిల్లాలోని సర్పంచ్‌లు 508, ఎంపీటీసీలు 230, వార్డు సభ్యులు 4,508, జెడ్పీటీసీలు 26లకు రిజర్వేషన్లను జిల్లా యంత్రాంగం ఖరారు చేసింది. శనివారం జెడ్పీటీసీ, ఎంపీపీలకు సంబంధించిన రిజర్వేషన్లను కలెక్టరేట్‌లో, సర్పంచ్, ఎంపీటీసీల రిజర్వేషన్లు ఎంపీడీఓ కార్యాలయాల్లో రాజకీయ పార్టీలకు చెందిన నాయకుల ఎదుట 50శాతం మహిళలకు సంబంధించిన డ్రాను తీశారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటన చేసినప్పటి నుంచి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీల రిజర్వేషన్లు ఏమి ఉండబోతున్నాయో అని ఆశావహుల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.
బీసీలకు 11 జెడ్పీటీసీలు
జిల్లా వ్యాప్తంగా 26 జెడ్పీటీసీలు, ఎంపీపీలుండగా అందులో 11 బీసీలు, ఎస్సీలకు 5, అన్ రిజర్వ్ 9, ఎస్టీలకు ఒకటి కేటాయించారు. జనరల్‌కు 15, మహిళలకు 11 కేటాయించారు. జెడ్పీటీసీ, ఎంపీపీలు అన్ రిజర్వ్‌కు 9 కేటాయించగా జనరల్‌కు 5, మహిళలకు 4, బీసీలకు 11 కేటాయించగా జనరల్‌కు 6, మహిళలకు 5, ఎస్సీలకు ఐదు కేటాయించగా జనరల్ 3, మహిళలకు 2, ఎస్టీ జనరల్‌కు కేటాయించారు.
పలువురికి నిరాశ
రిజర్వేషన్లు కలిసి రాకపోవడంతో పలువురు రాజకీయ నాయకులు నిరాశ చెందారు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీగా పోటీ చేయాలనుకున్న ఆశావహులకు ఇప్పటికే క్షేత్రస్థాయిలో అంతా సిద్ధం చేసుకున్నారు. పలువురు ఆశావహులకు రిజర్వేషన్లు కలిసిరాకపోవడంతో డైలామలో పడ్డారు. గత ఏడాది కాలంగా క్షేత్రస్థాయిలో పట్టుసాధించుకున్న నేతలు.. రిజర్వేషన్లు తారుమారు కావడంతో తలలు పట్టుకుంటున్నారు. అలాగే కొన్ని మండలాల్లో కొత్త లీడర్లు, వ్యాపారస్తులు వచ్చే అవకాశం ఉంది. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో ఇక ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ రావడమే మిగిలి ఉంది. నేడో రేపో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ రిజర్వేషన్లు
జెడ్పీ చైర్మన్ బీసీ జనరల్
సిద్దిపేట జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ రిజర్వేషన్ బీసీ జనరల్‌కు కేటాయించారు. దీంతో 11 మండలాల్లో గెలిచే జెడ్పీటీసీలలో ఒక్కరికి చైర్మన్ దక్కే అవకాశం ఉండనుంది.