
ఆయుర్వేదం జీవన విధానం
● ప్రకృతి సహజ మందులు ● కలెక్టర్ హైమావతి
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ఆయుర్వేదం అనేది వైద్యం మాత్రమే కాదని, భారతీయుల జీవన విధానమని కలెక్టర్ హైమావతి అన్నారు. జాతీయ ఆయుర్వేద దినోత్సవ సందర్భంగా మంగళవారం సిద్దిపేట పట్టణం నర్సాపూర్‌లోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఆయుష్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై వైద్య సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేల సంవత్సరాలుగా ఆయుర్వేద వైద్యం భారతీయుల జీవితాల్లో భాగమైందన్నారు. సూర్యుని ద్వారా లభించే శక్తిని స్వీకరించి సహజసిద్ధంగా పెరిగే ప్రకృతి సిద్ధమైన మొక్కల నుంచి ఆయుర్వేదిక్ మందులను తయారు చేస్తారన్నారు. ఆయుర్వేదిక్ మందులతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదన్నారు. మందులతో వ్యాధులు త్వరగా నయమవుతాయన్నారు. అందువలన అల్లోపతికి బదులుగా ఆయుర్వేదిక్ మందులను వినియోగించాలన్నారు. ప్రతి ఒక్కరూ మితాహారం, మసాలాలు తక్కువ తీసుకోవడం వల్ల రోగాలకు దూరంగా ఉండవచ్చని సూచించారు. వైద్య శిబిరంలో దాదాపు 300 మంది పరీక్షలు చేసుకొని మందులు తీసుకున్నారు. కార్యక్రమంలో ఆయుర్వేదవైద్యం జిల్లా ఇన్‌చార్జి డాక్టర్ రమాదేవి, మున్సిపల్ చైర్‌పర్సన్ మంజుల, వైద్యు లు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.