
వివరాలు నమోదు చేసుకుంటేనే ‘మద్దతు’
● జిల్లా వ్యవసాయాధికారి స్వరూపరాణి ● గజ్వేల్‌లో క్రాప్ సర్వే తీరు పరిశీలన
గజ్వేల్: రైతులు సాగుచేసిన పంటల వివరాలను నమోదు చేసుకుంటేనే మద్దతు ధరతోపాటు ఇతర ప్రయోజనాలను పొందే అవకాశం ఉందని జిల్లా వ్యవసాయాధికారి స్వరూపరాణి తెలిపారు. మంగళవారం గజ్వేల్‌లో పంటల నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఏఈఓలు క్రాప్ సర్వేలో నిమగ్నమయ్యారని చెప్పారు. సర్వే ముగియగానే ఏఈఓలు సంబంధిత జాబితాను పంచాయతీల్లో ప్రదర్శిస్తామని, అభ్యంతరాలుంటే రైతులు తెలియజేయాలని సూచించారు. వరి, పత్తి, మొక్కజొన్నతోపాటు పప్పుధాన్యాలు సోయాబీన్‌లాంటి కోత పూర్తయిన పంటలు కూడా నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. కౌలు రైతులకు సైతం ప్రత్యేక రిజష్టర్ నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ప్రతి రైతు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. కార్యక్రమంలో ఏడీఏ బాబునాయక్, వ్యవసాయాధికారి నాగరాజు, ఏఈఓలు పాల్గొన్నారు.