
సుందరీకరణ వేగిరం చేయండి
● మంత్రి పొన్నం ప్రభాకర్ ● ఎల్లమ్మ చెరువు కట్ట పనుల పరిశీలన
హుస్నాబాద్: ఎల్లమ్మ చెరువు కట్ట సుందరీకరణ పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. సోమవారం పట్టణంలోని ఎల్లమ్మ దేవాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సతీ సమేతంగా అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. చెరువు కట్ట సుందరీకరణ పనులు, సద్దుల బతుకమ్మ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ వర్షానికి కట్ట కోతకు గురైన ప్రాంతంలో మరమ్మతులు చేయించాలని ఆదేశించారు. బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించేందుకు ఎల్లమ్మ చెరువు వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. చెరువు నిండుగా ఉండటంతో కట్ట లోపలికి బారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. లైటింగ్, స్టేజీ, సౌండ్ సిస్టమ్, పోలీస్ బందోబస్తు, జాతీయ రహదారి నుంచి ఎల్లమ్మ చెరువు వైపు వెళ్లే రోడ్డులో ట్రాఫిక్ తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. అలాగే దసరా పండుగ రోజు నిర్వహించే రాంలీలా కార్యక్రమం విజయవంతం కోసం ప్రచారం నిర్వహించాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, ఆర్డీఓ రామూర్తి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్, మున్సిపల్ మాజీ వైస్‌చైర్‌పర్సన్ అయిలేని అనిత, అఖిలపక్ష నాయకులు ఉన్నారు.