
చట్టాలపై అవగాహన అవసరం
సీనియర్ సివిల్ జడ్జి మిలింద్ కాంబ్లే
మిరుదొడ్డి(దుబ్బాక)/సిద్దిపేటకమాన్: చట్టాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉంటేనే సమాజంలో క్రైం రేట్ తగ్గుతుందని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ మిలింద్ కాంబ్లే అన్నారు. మండల పరిధిలోని కొండాపూర్ ప్రభుత్వ పాఠశాలలో శనివారం చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అలాగే.. సిద్దిపేట జిల్లా జైలును సందర్శించి వంట గది, స్టోర్ రూంను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు చదువుతో పాటు, చట్టాలపై అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఎలాంటి సమస్యలు వచ్చినా వాటి పరిష్కారానికి జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సిద్దిపేట కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఖైదీలు సత్ప్రవర్తనతో ఉండాలన్నారు. ఖైదీలందరికీ న్యాయవాదుల ఉండాలన్నారు. లేనివారికి లీగల్ ఎయిడ్ కౌన్సిల్ న్యాయ సహాయం అందిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్ వికాస్, న్యాయవాదులు యాదయ్య, ఖాజీపురం యోగేందర్, పారా లీగల్ వాలంటీర్ సీహెచ్ కవిత, ప్రొ.పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు.