
వరినాట్ల జోరు
వర్షాలతో ఊపందుకున్న సాగు
● ఇప్పటికే 1.30 లక్షల ఎకరాలకుపైగా విస్తీర్ణం ● ఇప్పటి వరకు అధిక వర్షపాతం నమోదు ● సాగు మరింత పెరిగే అవకాశం
నాలుగు రోజులుగా తెరిపి లేకుండా కురిసిన వర్షాలతో జిల్లాలో సాగు స్వరూపం మారిపోతోంది. వరినాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. వర్షపాతం ఇదేవిధంగా కొనసాగితే సాగు మరింత ఊపందుకునే అవకాశం ఉంది. పత్తి, మొక్కజొన్న పంటలకు జీవం పోసినట్లయ్యింది. ఇప్పటికీ 1.30లక్షల ఎకరాలకుపైగా వరి సాగు అవుతున్నట్లు అంచనా.
గజ్వేల్: జిల్లాలో వానాకాలం సీజన్‌లో రైతుల ఆది నుంచి కష్టాలు పడుతున్నారు. సీజన్ అరంభం నుంచి 45రోజులకుపైగా వర్షాలు సక్రమంగా లేక పత్తి, మొక్కజొన్న పంటలు వాడిపోయే దశకు చేరుకున్నాయి. ఈ క్రమంలో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు కొంత ఊరటనిస్తున్నాయి. నల్లరేగడి భూముల్లో సాగు చేసిన పత్తి పంటలు జీవం పోసుకున్నాయి. మిగతా భూముల్లో వేసిన పత్తి ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయి మొక్కల ఎదుగుదల లోపించింది. మొక్కజొన్న పరిస్థితి ఇదే విధంగా ఉంది. జిల్లాలో పత్తి ఇప్పటివరకు 1.11లక్షల ఎకరాల సాగుకు అంచనాకు ఇప్పటివరకు 1.04లక్షల ఎకరాల్లో సాగయ్యింది. మొక్కజొన్న 40వేల ఎకరాల సాగు అంచనాకు 25,371 ఎకరాల్లో సాగులోకి వచ్చింది. అదేవిధంగా కందులు 5,297 ఎకరాలు, పెసర్లు 202, మినుములు 13.5, స్వీట్‌కార్న్ మరో 1,352 ఎకరాల్లో సాగులోకి వచ్చింది.
వర్షపాతం అధికం
పది రోజుల క్రితం వరకు అరకొరగా ఉన్న వర్షపాతం నాలుగురోజులుగా కురుస్తున్న వర్షాలతో ఒక్కసారిగా మారిపోయింది. జూన్ 1నుంచి ఇప్పటివరకు జిల్లాలో 271.9మి.మీ.ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఇప్పటివరకు 347.1మి.మీలు నమోదయ్యింది. ముందు కూడా వర్షాలు సమృద్ధిగా ఉంటాయనే ఆశతో రైతులు వరి నాట్లు ముమ్మరం చేశారు. జిల్లాలో 5.60లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగులోకి వస్తాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందులో అత్యధికంగా వరి 3.76లక్షల ఎకరాలకుపైగా సాగవుతుందని అంచనా వేస్తే.. కురుస్తున్న వర్షాలకు 1.30లక్షల ఎకరాల్లో సాగులోకి వచ్చిందని వ్యవసాయశాఖ చెబుతున్నది. భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందువల్ల సాగు మరింతగా పెరగొచ్చని, అంచనాలను చేరుకోవచ్చని కూడా వ్యవసాయశాఖ భావిస్తోంది.
యూరియా అధికంగా వాడటం వల్లే..
మరోవైపు రైతులు ఎకరాకు ఒక్క బస్తా యూరియా మాత్రమే వాడాల్సి ఉండగా.. 3– 4బస్తాలు వాడుతుండటం కూడా కొరతకు కారణమవుతున్నదని వ్యవసాయశాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో రైతుకు ఎకరాకు ఒక్క యూరియా బస్తా మాత్రమే ఇవ్వాలని గట్టిగా ఆదేశాలిచ్చారు. యూరియా కొనుగోలు సందర్భంగా రైతుల వివరాలను నమోదు చేసుకోవాలని చెబుతున్నారు. వ్యవసాయశాఖ ఎన్ని ప్రయత్నాలు చేసినా నిల్వలు సమృద్ధిగా లేకపోతే ఎరువుల దుకాణాల వద్ద క్యూలైన్లు తప్పేలా లేవు.
సాగు పెరిగే అవకాశం
జిల్లాలో వర్షపాతం బాగుంది. వరి నాట్లు ఊపందుకున్నాయి. అంచనాలకు తగ్గట్టుగానే జిల్లాలో వరి సాగయ్యే అవకాశం ఉంది. పత్తి, మొక్కజొన్న పంటలు జీవం పోసుకున్నాయి. జిల్లాలో యూరియా కొరత తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తాం.
– స్వరూపరాణి, జిల్లా వ్యవసాయాధికారి
యూరియా కొరతపై ఆందోళన
యూరియా కొరతపై జిల్లాలో ఆందోళన నెలకొంది. వానాకాలం సీజన్ అవసరాలకు 35,144 మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు కేవలం 10వేల మెట్రిక్ టన్నులకుపైగా మాత్రమే వచ్చింది. నిజానికి ఈ సమయానికి జిల్లాకు అవసరమైన యూరియా నిల్వల్లో ఇప్పటికే 75శాతం అందుబాటులో ఉండేది. కానీ ప్రస్తుతం భిన్నంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. సాధారణ యూరియా కొరత నేపథ్యంలో వ్యవసాయశాఖ నానో యూరియా వాడాలని ప్రచారం చేస్తున్నా.. రైతులు ఇప్పుడే ఆ దిశగా వెళ్లే అవకాశం కనిపించడం లేదు.
బుడ్డోడి వ్యవ‘సాయం’
బడులకు ఆదివారం సెలవు కావడంతో లింగుపల్లిలో ఓ చిన్నారి తన తల్లిదండ్రులతో పొలం వద్దకు వెళ్లి వ్యవసాయంలో సాయ పడుతూ ఉత్సాహంగా కనిపించాడు. చిట్టి చిట్టి చేతులతో వరి నారు మోస్తూ అబ్బుర పరిచాడు. నారును విసురుతూ చూపరులను ఆకట్టుకున్నాడు.
– మిరుదొడ్డి(దుబ్బాక)

వరినాట్ల జోరు

వరినాట్ల జోరు