
దోమల నివారణకు చర్యలేవీ?
● మూలనపడ్డ ఫాగింగ్ యంత్రాలు ● గ్రామాల్లో విజృంభిస్తున్న దోమలు ● పట్టించుకోని అధికారులు
అక్కన్నపేట(హుస్నాబాద్): అసలే గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ అంతంత మాత్రమే ఉంది. వర్షాకాలం వచ్చిందంటే ఎక్కడ పడితే అక్కడ నీరు నిల్వ ఉండి, మురుగు కాలువలు నిండి కాలనీల్లో అధ్వానంగా మారుతాయి. దీంతో దోమలు విజృంభిస్తున్నాయి. మలేరియా, డెంగీ, డయేరియా, చికున్‌గున్యా వంటి రోగాల బారిన పడుతుంటారు. ప్రజలను సీజనల్ వ్యాధుల బారిన పడకుండా కాపాడేందుకు వర్షాకాలంలో ప్రత్యేక చర్యలు తీసు కోవాలని ప్రభుత్వం అధికారులను ఆదేశిస్తున్నా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. వానకాలంలో ప్రత్యేకించి దోమల నివారణకు చర్యలు చేపట్టాల్సి ఉంది. వానాకాలం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నిరుపయోగంగా ఫాగింగ్ యంత్రాలు
వానాకాలంలో దోమల నివారణకు గతంలో పంచాయతీలు ఫాగింగ్ యంత్రాలు కొనుగోలు చేశాయి. నిధులు తక్కువగా ఉండే జీపీలు వేరే జీపీల నుంచి తీసుకుని వాడుకునేలా అధికారులు చర్యలు తీసుకునేవారు. గతేడాది వరకు ఆడపదడపా వాటి వినియోగం కనిపించినా ఈ యేడాది మాత్రం నామమాత్రంగా కూడా కనిపించడం లేదు. మండలంలో మొత్తం 38 గ్రామాలు ఉండగా దాదాపుగా 15 గ్రామాల్లో ఫాగింగ్ యంత్రాలు కొనుగోలు చేశారు. ఒక్కొక్క దానికి రూ.40 వేల నుంచి రూ.60 వేలు నిధులు వెచ్చించారు. వాటి వినియోగంపై అవగాహన లేక పెట్రోల్, డీజిల్, లిక్విడ్ సమపాళ్లలో కలపకపోవడంతో తరుచూ పాడవుతున్నాయని తెలుస్తోంది. మళ్లీ మరమ్మత్తు చేయించాలంటే ఖర్చు భారీగా అవుతున్నట్లు సమాచారం. దీంతో గతేడాది పాడైపోయిన యంత్రాలు ఇప్పటివరకు మరమ్మత్తులకు నోచుకోలేదు. నిధులు లేమితో యంత్రాలు గ్రామ పంచాయతీ కేంద్రాల్లో మూలన పడ్డాయి.
నిధుల లేమి
చాలా పంచాయతీలలో ఎక్కడ పడితే అక్కడ చెత్త కుప్పలు దర్శన మిస్తున్నాయి. డ్రైనేజీలు చెత్తాచెదారంతో నిండిపోయాయి. దీంతో రోడ్లపై మురుగునీరు ప్రవహిస్తోంది. దీంతో గ్రామాలలో దోమలు విపరీతంగా పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం నిల్వ నీటి మడుగుల్లో ఆయిల్ బాల్స్ వేయడం వంటి చర్యలు కూడా తీసుకోవడం లేదు. ఉన్నతాధికారులు ఇప్పటికై నా ఫాగింగ్ యంత్రాలను వినియోగంలోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
చర్యలు తీసుకుంటున్నాం..
గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై పంచాయతీ కార్యదర్శులతో ప్రతి బుధవారం ప్రత్యేక సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నాం. డ్రైడే నిర్వహణ, నిల్వ నీటిలో ఆయిల్ బాల్స్ వేయడం వంటి చర్యలు తీసుకుంటున్నాం. ఫాగింగ్ యంత్రాలు కూడా అందుబాటులో ఉన్నాయి. గ్రామాల్లో దోమల నివారణకు చర్యలు తీసుకుంటాం. పాడైన ఫాగింగ్ యంత్రాలకు మరమ్మతులు చేయించి వినియోగంలోకి తీసుకొస్తాం. – భానోతు జయరాం, ఎంపీడీఓ

దోమల నివారణకు చర్యలేవీ?

దోమల నివారణకు చర్యలేవీ?