
బీటీ రోడ్డు నిర్మించాలని వినతి
చేర్యాల(సిద్దిపేట): మండల పరిధిలోని ముస్త్యాల గ్రామ వేముల పోచమ్మ దేవాలయం వరకు బీటీ రోడ్డు నిర్మించాలని కోరుతూ సీపీఐ మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక తహసీల్దార్ దిలీప్‌నాయక్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లానేత అందె అశోక్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఈరి భూమయ్య మాట్లాడుతూ పోచమ్మ దేవాలయానికి నిత్యం వందలాది మంది రాకపోకలు సాగిస్తారన్నారు. అలాంటి ఆలయం వరకు మట్టి రోడ్డు ఉండడంతో వర్షం పడితే రోడ్డు బురదగా మారి భక్తులు ఇబ్బంది పడుతున్నారని వాపోయారు. ఆలయం వరకు బీటీరోడ్డు మంజూరు చేయించాలని కోరుతూ తహసీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు. సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తానని తహసీల్దార్ హామీ ఇచ్చారని చెప్పారు. నాయకులు భద్రయ్య, ప్రభాకర్, రాజు, కుమార్, నర్సిరెడ్డి, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.