
అభివృద్ధిపైనే దృష్టి
● ఎన్నికలప్పుడే రాజకీయాలు ● ఎంపీ రఘునందన్‌రావు, ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి
దుబ్బాక: రాజకీయ జన్మనిచ్చిన దుబ్బాక ప్రాంతాన్ని రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేసుకుందామని ఎంపీ మాధవనేని రఘునందన్‌రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఆదివారం దుబ్బాక పట్టణంలో పోచమ్మ ఆలయ పునర్నిర్మాణానికి ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని కులాల ఆరాధ్యదైవం పోచమ్మ తల్లి ఆలయాన్ని అన్ని సౌకర్యాలతో నిర్మించుకుందామన్నారు. ఎన్నికలప్పుడే రాజకీయాలన్నారు.
రెవెన్యూ డివిజన్ కోసం ఉద్యమిస్తాం
దుబ్బాక రెవెన్యూ డివిజన్ సాధన కోసం రాజకీయాలకు అతీతంగా పోరాడుదామని ఎంపీ, ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. రెవెన్యూ డివిజన్‌తో పాటు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, దుబ్బాక–హబ్షీపూర్ ల మధ్య నాలుగులేన్ల రోడ్డును సాధించుకునేందుకు కార్యచరణ రూపొందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయం పనర్‌నిర్మాణ కమిటీ బాధ్యులు, పట్టణంలోని అన్ని కుల సంఘాల నాయకులు తదితరులు ఉన్నారు.
నయాపైసా నిధులివ్వట్లేదు: కొత్త
దుబ్బాక: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడుస్తున్నా నియోజకవర్గానికి నయాపైసా నిధులివ్వలేదని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఆదివారం దుబ్బాక పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని పలు బాధిత కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు నిధులు మంజూరు చేయకుండా కక్ష సాధింపు ధోరణిని అవలంబిస్తోందన్నారు. నిధులు లేక అభివృద్ధి కుంటుపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికై నా న్యాయబద్దంగా నిధులు మంజూరు చేయాలన్నారు.