ప్లీజ్‌.. తప్పుకోండి! | Sakshi
Sakshi News home page

ప్లీజ్‌.. తప్పుకోండి!

Published Wed, Nov 15 2023 4:32 AM

- - Sakshi

మంత్రాంగం మొదలైంది.. యుద్ధంలో గెలవాలంటే బలం.. బలగం కాదు.... బుద్ధిబలమే ముఖ్యం అన్న వ్యూహాన్ని నేతలు గుర్తిస్తున్నారు. ఎన్నికల రేసులో ఎవరి స్థానం ఏమిటి? ఎవరి బలమెంత? అని లెక్కలు గట్టడంలో అభ్యర్థులతో పాటు ఆయా పార్టీల ముఖ్య నేతలు బిజీగా ఉంటున్నారు. పొద్దంతా ప్రచారం.. రాత్రంతా వ్యూహాలు రచిస్తున్నారు. ఇదీ ప్రస్తుతం గజ్వేల్‌, దుబ్బాక, హుస్నాబాద్‌, సిద్దిపేట నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితి.

జోరుగా బుజ్జగింపులు

ఖర్చులు చెల్లిస్తాం.. సమస్యలు పరిష్కరిస్తాం అంటూ ఆఫర్లు

ఇంకొందరికి గుడ్‌విల్‌ ఇస్తామంటూ హామీలు

గజ్వేల్‌లో శంకర్‌హిల్స్‌ భూ బాధితులు

నామినేషన్ల ఉపసంహరణకు నేడే ఆఖరు

నియోజకవర్గం గుర్తింపు పొందిన రిజిస్ట్రర్‌ ఇండిపెండెంట్లు మొత్తం

గజ్వేల్‌ 04 19 63 86

సిద్దిపేట 04 09 24 37

దుబ్బాక 04 06 05 15

హుస్నాబాద్‌ 04 11 18 33

సాక్షి, సిద్దిపేట: శాసనసభ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 3నుంచి 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించారు. 13 వరకు నామినేషన్లను పరిశీలించారు. బుధవారం ఉపసంహరణ గడువు ముగియనుంది. నాలుగు నియోజకవర్గాల్లో 200 మంది అభ్యర్థుల నామినేషన్లు అమోదం పొందాయి. అందులో ఇండిపెండెంట్లు 110, జాతీయ, ప్రాంతీయ పార్టీలుగా గుర్తింపు పొందిన వాటి నుంచి 16 మంది, రిజిస్ట్రర్‌ పొలిటికల్‌ పార్టీల నుంచి 45 మంది అభ్యర్థులు ఉన్నారు.

శంకర్‌ హిల్స్‌ భూ బాధితులు

గజ్వేల్‌ నియోజక వర్గంలో 114 మంది నామినేషన్లు అమోదం పొందగా, అందులో 91 మంది ఇండిపెండెంట్లు ఉన్నారు. వీటిలో ఎక్కువగా రంగారెడ్డి జిల్లా వట్టివాగులపల్లిలోని శంకర్‌ హిల్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సభ్యులు నామినేషన్‌లు వేశారు. భూ సమస్య కోసం ప్రజాప్రతినిధుల చుట్టూ తిరి గినా పరిష్కరించకోపోవడంతో నిరసనగా వారు నామినేషన్లు వేశారు. అలాగే బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ గజ్వేల్‌ పై ఎక్కువగా ఫోకస్‌ పెట్టారు. ఇండిపెండెంట్‌ అభ్యర్థులను బుజ్జగింపుల పై బీఆర్‌ఎస్‌ నేతలు ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. శంకర్‌ హిల్స్‌ వాసుల సమస్యను అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. నామినేషన్లను ఉపసంహరించుకోవాలని కోరుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. హుస్నాబాద్‌లో గౌరవెల్లి భూ నిర్వాసితులు పలువురు నామినేషన్లు వేశారు. వారిని సైతం బుజ్జగించే పనిలో బీఆర్‌ఎస్‌ నేతలు పడ్డారు. సిద్దిపేటలో ఒకరు తన భూ సమస్య పరిష్కారం చూపడం లేదని నిరసనగా నామినేషన్‌ దాఖలు చేశారు.

ఖర్చు మొత్తం భరిస్తాం

ఇప్పటి వరకు అయిన ఖర్చు ఇస్తామంటూ ఇండిపెండెంట్‌ అభ్యర్థులను మచ్చిక చేసుకునే పనిలో అధికార పార్టీ మధ్యవర్తులను రంగంలోకి దింపినట్లు సమాచారం. పెట్టిన ఖర్చులతో పాటు గుడ్‌ విల్‌ ను సైతం ఇస్తామని ఆఫర్లు సైతం ఇస్తున్నారని తెలుస్తోంది. సదరు అభ్యర్థులు బరిలో ఉంటే ఓట్లు గండి పడే అవకాశం ఉంటుందని ప్రధాన పార్టీల అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. దీంతో మధ్యవర్తులను రంగంలో దింపి బుజ్జగింపులు ప్రారంభించారు. కొందరు ఇండిపెండెంట్లకు భవిష్యత్‌లో అండగా ఉంటామని హామీలు ఇస్తున్నారు. కొంతమందికి పదవుల ఆశ చూపుతున్నట్లు సమాచారం.

బరిలో ఉండేది ఎవరో?

ఆయా నియోజకవర్గాల్లో బరిలో ఎవరు ఉంటారో నేడు తెలనుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు బుధవారం మధ్యాహ్నం 3గంటల వరకు ఉంది. తర్వాత సాయంత్రం ఇండిపెండెంట్‌ అభ్యర్థులకు గుర్తులను కేటాయించనున్నారు.

గజ్వేల్‌లో 28 మంది ఉపసంహరణ

గజ్వేల్‌: అసెంబ్లీ సెగ్మెంట్‌లో నామినేషన్ల ఉపసంహరణ జోరుగా సాగుతోంది. స్క్రూటినీలో 13 నామినేషన్లు తిరస్కరణకు గురైన తర్వాత 114మంది పోటీలో ఉన్నారు. ఇందులో మంగళవారం 28మంది స్వతంత్ర అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఫలితంగా 86 మంది పోటీలో మిగిలారు. ఈ విషయాన్ని స్థానిక ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి బన్సీలాల్‌ తెలిపారు. ఇదిలా ఉంటే హుస్నాబాద్‌లోనూ ఒకరు ఇండిపెండెంట్‌ తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement