వరి కీలక దశలో అప్రకటిత కోతలు
ఆదుకున్న వాన..
అన్నదాతలకు కరెంట్ కష్టాలు షురువయ్యాయి. వ్యవసాయ విద్యుత్ సరఫరాలో అప్రకటిత కోతలు..లో ఓల్టేజీ సమస్యతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పంటలు కీలక దశలో ఉన్న సమయంలో విద్యుత్ సమస్యలు వస్తున్నాయని వాపోతున్నారు. అప్రకటిత విద్యుత్ కోతలు, లో ఓల్టేజీ సమస్యను నిరసిస్తూ ఇటీవల నిజాంపేటలో రైతులు నిరసనకు దిగారు. నాందేడ్–అకోలా రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. అధికారులు తక్షణం సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
–సాక్షిప్రతినిధి, సంగారెడ్డి
ప్రధానంగా వరి పొట్ట దశలో ఉంది. ఇలాంటి కీలక దశలో సమయానికి సాగు నీరు అందితేనే వరి గట్టెక్కుతుంది. కానీ ఈ దశలో విద్యుత్ సరఫరా సరిగ్గా లేక పంటల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలో ఈ ఖరీఫ్ సీజనులో 7.04 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. వరి 1.22 లక్షల ఎకరాల్లో వేసుకున్నారు. ప్రధానంగా హత్నూర, ఆందోల్, గుమ్మడిదల, జిన్నారం, నిజాంపేట, కల్హేర్, కంగ్టి, నారాయణఖేడ్, పుల్కల్, చౌటకూర్, వట్‌పల్లి తదితర మండలాల్లో వరి సాగవుతోంది. ఈసారి ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు సరిగ్గా కురియలేదు. దీంతో రైతులకు బోర్లే ఆధారం.
● గత కొన్ని రోజులుగా వ్యవసాయ విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయం ఏర్పడుతోంది. చాలాచోట్ల ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు త్రీఫేజ్ కరెంట్ ఇస్తున్నారు. అయితే తరచూ ట్రిప్ అవుతోంది. దీంతో తడిసిన మడే తడిస్తోందని, చివరి మడి ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు. లోఓల్టేజీ సమస్యతో మోటార్లు, స్టార్టర్లు కాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటి మరమ్మతులు అదనపు భారం అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
33 వేల యూనిట్లు పెరిగిన వినియోగం
జిల్లాలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగిందని ఆశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. వ్యవసాయ విద్యుత్‌తోపాటు, గృహ విద్యుత్ వినియోగం కూడా ఒకేసారి పెరిగిందని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 8.91 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉండగా, ఇందులో 1.09 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు న్నాయి. సాధారణ రోజుల్లో రోజుకు 32.88 లక్షల యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగితే.. ప్రస్తుతం 33.21 లక్షలకు పెరిగిందని పేర్కొంటున్నారు.
● ఉన్నఫళంగా వినియోగం గణనీయంగా పెరగడంతో సరఫరాలో సమస్యలు తలెత్తుతున్నాయని తెలుస్తోంది. దీన్ని ఈ సమస్యను అధిగమించేందుకు ఆశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఏఈలు, ఏడీఈలు, డీఈ స్థాయి అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి కొంతమేరకు పరిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాలని కూడా సూచిస్తున్నారు.
లో ఓల్టేజీ సమస్యతోనూ ఇబ్బందులు
నిజాంపేటలో రోడ్డెక్కి నిరసన తెలిపిన రైతులు
అప్రమత్తమైన విద్యుత్‌శాఖ అధికారులు
రెండు రోజుల క్రితం కురిసిన వాన రైతులకు ఎంతో మేలు చేసింది. సరిగ్గా నీరు అందక ఎండిపోయే పరిస్థితికి దారితీసిన తరుణంలో ఈ వానప్రాణం పోసిందని రైతులు పేర్కొంటున్నారు. లేనిపక్షంలో వ్యవసాయవిద్యుత్ వినియోగం మరింత పెరిగేది. ఈ వాన వారం రోజుల పాటు పంటలను కాపాడుతుందని రైతులు ఆశాభావంతో ఉన్నారు.


