● జిల్లాలో 18 సొసైటీ కార్యాలయాలు ఎంపిక
● రూ.15 లక్షల వరకు మ్యాచింగ్ గ్రాంట్ నిధులు
● 750 మంది రైతులతో సభ్యత్వాలు
సంగారెడ్డి జోన్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (సొసైటీ కేంద్రాలు)ను రైతుల ఉత్పత్తి సంస్థలు (ఎఫ్‌పీఓ)లుగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా తొలుత రాష్ట్రంలోని నిజామాబాద్, నల్లగొండ జిల్లాలను గుర్తించింది. తాజాగా జిల్లాలోని 53 సొసైటీ కేంద్రాల్లోని 18 కేంద్రాలను ఎఫ్‌పీఓలుగా మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా ఇప్పపల్లి, ఇందూర్, సత్వార్, చెల్మెడా (కలాన్), సదాశివాపేట, కంది, మనూర్, కంగ్టి, కృష్ణపూర్, ఇస్మాయిల్ ఖాన్ పేట, శివంపేట, సోలాక్‌పల్లి, ముత్తాంగి, హత్నూర, తెల్లపూర్, పటాన్ చెరు, గుమ్మడిదల సొసైటీలను ఎఫ్‌పీఓలుగా మార్చనుంది.
ఒక్కో సొసైటీలో 750 మంది రైతుల సభ్యత్వాలు
రైతు ఉత్పత్తిదారుల సంస్థకు ఏర్పాటైన కేంద్రంలో 750 మంది రైతులకు సభ్యత్వాలు అందిస్తారు. సభ్యత్వం పొందిన రైతు రూ.2 వేలు చెల్లించాల్సి ఉంటుంది. సభ్యత్వం పొందిన ప్రతీ ఒక్కరికి సమానంగా కేంద్ర ప్రభుత్వం రూ.2 వేలు అందజేస్తుంది. ఈ విధంగా రైతులు రూ.15 లక్షలు సమకూర్చుకోగా కేంద్ర ప్రభుత్వం రూ.15 లక్షల వరకు సబ్సిడీ అందిస్తుంది. వీటితోపాటు రూ.రెండు కోట్ల వరకు రుణ సౌకర్యం కూడా కల్పిస్తుంది. వీటి ద్వారా వ్యాపారాలు నిర్వహించి ఆర్థిక అభివృద్ధి సాధించేందుకు చేయూతనిస్తుంది. ఎఫ్‌పీఓ లుగా మారిన ప్రతీ సొసైటీకి జాతీయ సహకార అభివృద్ధి సంస్థ, నాబార్డ్ సంస్థల నుంచి రుణ సౌకర్యం అందుతుంది. పంట ఉత్పత్తులను కొనుగోలు చేయడమే కాకుండా గ్రేడింగ్, ప్రాసెసింగ్ యూనిట్లు, కోల్డ్ స్టోరేజీలు, మినీ రైస్ మిల్లులు, ప్యాకింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ కేంద్రాల నిర్వహణ ద్వారా వచ్చే ఆదాయంతో రైతులు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు సులభతరంగా ఉంటుంది.
మెరుగైన సేవలు
సొసైటీలో సభ్యత్వం పొందిన రైతులు ఆర్థికాభివృద్ధి సాధించడంతోపాటు తోటి రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు వీలుంటుంది. కొనుగోలు కేంద్రాలతోపాటు ఎరువుల అమ్మకాలకు మొదటగా ఎఫ్‌పీఓలకు ప్రాధాన్యం ఇస్తారు. దళారుల ప్రమేయం లేకుండా సభ్యులే నేరుగా పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తారు. వివిధ రకాల కంపెనీల నుంచి నేరుగా ఎరువులు, విత్తనాలను కొనుగోలు చేసి స్థానికంగా ఉన్న రైతులకు హోల్ సేల్ ధరలకే అమ్ముతారు. ఎఫ్‌పీఓలుగా మార్పు చెందితే ప్రస్తుతం ఉన్న సేవలతోపాటు మరిన్ని సేవలు అందుబాటులోకి రానున్నాయి.
రైతు ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా...
సొసైటీ పరిధిలో ఉన్న రైతుల ఆర్థికాభివృద్ధి సాధించడమే లక్ష్యంగా ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలను రైతు ఉత్పత్తిదారుల సంస్థలుగా మార్చుతున్నారు. జిల్లాలో ఉన్న 18 సొసైటీలను మార్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా సొసైటీల్లో సభ్యత్వాల నమోదు కొనసాగుతోంది. ప్రక్రియ పూర్తయితే రైతులకు మరింత మెరుగైన సేవలు అందుతాయి.
–కిరణ్ కుమార్,
జిల్లా కో–ఆపరేటివ్ అధికారి, సంగారెడ్డి


