వైద్య సేవలు మరింత బలోపేతం | - | Sakshi
Sakshi News home page

వైద్య సేవలు మరింత బలోపేతం

Aug 8 2026 8:43 AM | Updated on Aug 8 2026 8:43 AM

సంగారెడ్డి జోన్‌: జిల్లాలో వైద్య, ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌తోపాటు అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...జిల్లాలో సీజనల్‌ వ్యాధుల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో అవసరమైన మందులు, వైద్య పరికరాలు, ఇతర వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని కంకోల్‌, సింగితం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని, బర్దిపూర్‌, సుల్తాన్‌పూర్‌, నేరడిగుంట పీహెచ్‌సీ భవన నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. సంగారెడ్డి నర్సింగ్‌ కళాశాల, పటాన్‌చెరు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి, జహీరాబాద్‌ ఎంపీహెచ్‌లను త్వరలో ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. విద్యా రంగంలో మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కేజీబీవీలు, మోడల్‌ స్కూళ్లపై ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని స్పష్టం చేశారు. త్రాగునీరు, డ్రైనేజీ, మరుగుదొడ్ల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించి అవసరమైన పనులను పూర్తి చేయాలని సూచించారు. కొత్త రేషన్‌ కార్డుల జారీ ఈ నెల 15న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికతో ముందస్తు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు మంత్రి సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు సంగీత, పాండు, సబ్‌ కలెక్టర్‌ ఉమాహారతి, సంబంధిత శాఖల అధికారులు, రెవెన్యూ డివిజనల్‌ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

మంత్రి దామోదర రాజనర్సింహ

అధికారులతో సమీక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement