● ముసురుతో ఆరుతడి పంటలకు మేలు
● ఆరు మండలాల్లో అధికం, 20 మండలాల్లో సాధారణ వర్షపాతం
నారాయణఖేడ్: అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదైంది. దీంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. ఆరుతడి పంటలన్నీ జీవం పోసుకున్నాయి. ముందు ముందు కూడా ఇదే పరిస్థితి కొనసాగితే జిల్లాలో అన్నదాతలు కష్టాలను గట్టెక్కినట్లే. కురిసిన వర్షాలు పప్పు దినుసులు, నూనె గింజల పంటలకు మేలు చేకూర్చాయని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో జూన్‌లో సాధారణ వర్షపాతం 120.0 మి.మీ కురియాల్సి ఉండగా 132.0 మి.మీ కురిసింది. జూలైలో 194.2 మి.మీకు 203.2 మి.మీ నమోదైంది. గత నెలలో 10 శాతం అధికంగా ఈ నెలలో 6.3 శాతం అధికంగా వర్షం కురిసింది.
రెండు మండలాల్లోనే తక్కువ
జిల్లాలోని రెండు మండలాలైన జహీరాబాద్, ఆందోల్ మండలాల్లో మాత్రమే కాస్త తక్కువ వర్షపాతం నమోదు అయ్యింది. ఇదే సమయంలో సిర్గాపూర్, మనూరు, కంగ్టి, పుల్కల్, కొండాపూర్, ఆర్సీపురం మండలాల్లో అధిక వర్షపాతం కురిసింది. జిల్లాలోని 28 మండలాల్లో 20 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు. రెండు మండలాల్లో కాస్త తక్కువ, ఆరు మండలాల్లో ఎక్కువ వర్షపాతం కురిసింది. జిల్లాలో కంది పంట 72,594 ఎకరాలు, పెసర 8,226, మినుము 6,253, మొక్కజొన్న 8,489, సోయాబీన్ 71,888, పత్తి జిల్లాలోనే అత్యధికంగా 3,55,609 ఎకరాల్లో సాగు చేశారు. ముందు ముందు కూడా ఇదే తరహాలో సాధారణ వర్షపాతం నమోదైతే సాగులో ఉన్న పంటలకు మేలు జరిగి రైతులు మంచి దిగుబడులు సాధించే అవకాశాలు ఉన్నాయి.
పూత, కాత దశలో పెసర, మినుము
జూన్‌లో మధ్య మధ్యలో వర్షాలు కురియడం, జూలైలో సైతం అప్పుడప్పుడు కురిసిన చినుకులతో పెసర, మినుము పంటలకు మంచి మేలు చేకూరింది. ప్రస్తుతం ఈ రెండు పంటలు పూత, కాత దశలో ఉన్నాయి. మృగశిర కార్తెకు రెండు రోజుల ముందు కురిసిన వర్షాలకు కొందరు రైతులు పెసర, మినుము విత్తుకోగా ఆ పంటలు ప్రస్తుతం కాతదశకు వచ్చాయి. తర్వాత వేసిన కమతాల్లోని పంట పూత, అక్కడక్కడా కాత దశలో ఉన్నాయి. పెసర, మినుము స్వల్పకాలికాలు కావడంతో 70 నుంచి 75 రోజుల్లో పంట చేతికొస్తుంది. ఇప్పటికే 45 నుంచి 50 రోజుల కాలం అవుతుంది. మరో 25 రోజుల్లోపు పెసర, మినుము పంటలు నూర్పిళ్లు చేసుకొనే అవకాశం ఉంది. గతేడాది పెసర, మినుము భారీగా దెబ్బతినగా, ఈసారి వాతావరణం ఇలాగే అనుకూలిస్తే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది.


