చివరి దశకు ప్రక్రియ
వలస ఓటర్లు..
ఆచూకీ లేని వారు 7,592 మంది
వే
ల
మరణించిన వారు 36 వేలు
1.31 లక్షలకు మించి ఓట్ల తొలగింపు
ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం
ఎస్‌ఐఆర్ ప్రక్రియకు రెండు రోజులే గడువు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోయిన ఓటర్లు 58,109 మంది ఉన్నట్లు అధికారులు తేల్చారు. మొత్తం ఓటర్లలో సుమారు 4 శాతం మంది వలస వెళ్లినట్లు తేలింది. శుక్రవారం సుమారు 77 శాతం ఎన్యూమరేషన్ ఫారాలను డిజిటలైజేషన్ చేయగా వీరంతా స్థానికంగా ఉండటం లేదని గుర్తించారు. మిగిలిన 23 శాతం ఎన్యూమరేషన్ ఫారాలు డిజిటలైజేషన్ పూర్తి చేస్తే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. అత్యధికంగా నారాయణఖేడ్ నియోజకవర్గం నుంచి సుమారు 13,935 మంది, ఆందోల్ నియోజకవర్గంలో 13,662 మంది ఓటర్లు వేరే ప్రాంతాలకు వెళ్లిపోయినట్లు తేలింది. సంగారెడ్డి నియోజకవర్గం నుంచి అతి తక్కువగా.. 7,980 మంది వలస వెళ్లినట్లు గుర్తించారు. వారందరిని ఓటరు జాబితా నుంచి తొలగించనున్నారు.
మరణించిన ఓటర్ల లెక్క కూడా తేలింది. ఇప్పటి వరకు 36,479 మంది మరణించిన వారి పేర్లు ఓటరు జాబితాలో ఉన్నట్లు గుర్తించారు. ఈ ఆత్మల ఓటర్లను కూడా జాబితా నుంచి తీసివేస్తారు. మొత్తం ఓటర్లలో 2.5 శాతం మంది మరణించిన ఓటర్లు ఇప్పటి వరకు ఓటరు జాబితాలోనే ఉన్నట్లు స్పష్టమవుతోంది. అత్యధికంగా జహీరాబాద్ నియోజకవర్గంలో మరణించిన ఓటర్లు 8,621 ఉంటే.. తక్కువగా నారాయణఖేడ్‌లో 5,366 మంది ఉన్నట్లు తేలింది.
ఆచూకీ తెలియని ఓటర్ల లెక్క కూడా తేలుతోంది. ఇప్పటి వరకు జిల్లాలో 7,592 మంది ఓటర్ల ఆచూకీ ఇంత వరకు తెలియడం లేదు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఇలా ఆచూకీ లేని ఓటర్లు 3,192 మంది ఉండగా, పటాన్‌చెరులో 508 మంది ఉన్నారు.
వేరే చోట ఓటరుగా నమోదు చేసుకున్న ఓటర్లు 29,117 మంది గుర్తించారు. వీరంతా ఇతర జిల్లాలో, ఇతర రాష్ట్రాల్లో ఓటరుగా నమోదైన వారు పటాన్‌చెరులో 6,544 మంది ఓటర్లు ఇలాంటి వారు ఉన్నట్లు తేలింది. ఈ నియోజకవర్గంలో ఉత్తరాధి రాష్ట్రాలకు చెందిన ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. వీరిని కూడా ఈసారి ఓటరు జాబితా నుంచి తొలగించనున్నారు. ఇవి కాకుండా ఇతర కేటగిరీలో మరో 487 మంది ఓటర్లను ఈజాబితా నుంచి తీసివేయనున్నారు.
తొలగించే ఓటర్లు 9 శాతానికి మించి
జిల్లాలో మొత్తం 14.57 లక్షల మంది ఓటర్లు ఉండగా, శుక్రవారం వరకు జరిగిన ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ఇలా మరణించిన ఓటర్లు, ఇతర చోట్ల ఓటరుగా నమోదైన వారు, ఆచూకీ లేని వారు.. అన్ని క్యాటగిరిలో కలిపి 1.31 లక్షల ఓట్లను తొలగించే జాబితాలో చేర్చనున్నారు. అంటే 9.04 శాతం ఓట్లు తొలగించే ఓట్లుగా తేలింది.
ఎస్‌ఐఆర్ (ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ) ప్రక్రియ చివరి దశకు చేరకుంది. జిల్లాలో మొత్తం 14.57 లక్షల మంది ఓటర్లు ఉండగా, ఇప్పటి వరకు 11.31 లక్షల ఓటర్లకు సంబందించిన ఎన్యుమరేషన్ ఫారాలు డిజిటలైజేషన్ చేశారు. అంటే మొత్తం ఓటర్లలో 77.64 శాతం ఈ ప్రక్రియ పూర్తయినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఇంకా 3.26 లక్షల ఓటర్లకు సంబందించిన ఎన్యుమరేషన్ ఫారాలు డిజిటలైజేషన్ చేయాల్సి ఉంది.
ఈ ప్రక్రియకు కేవలం రెండు రోజులే గడువుంది. ఆగస్టు 3 తేదీలోగా ఈ డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. ఈ రెండు రోజుల్లో మిగిలిన 3.26 లక్షల ఎన్యుమరేషన్ ఫారాలను డిజిటలైజేషన్ చేస్తే తొలగించనున్న ఓటర్ల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలున్నాయి.
ప్రధానంగా ఆచూకీ తెలియని ఓటర్లు, ఇతర ప్రాంతాల్లో ఓటరుగా నమోదైన వారు, మరణించిన ఓటర్లు.. ఇలా జాబితా నుంచి తొలగించనున్న ఓటర్ల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలున్నాయి.


