బెజ్జంకి(సిద్దిపేట): మండలంలోని గుగ్గిల్ల క్రాస్‌రోడ్డు వద్ద గల రాజీవ్ రహదారిపై చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ కారుడ్రైవర్ మృతి చెందాడు. మృతుడి భార్య రేఖ ఫిర్యాదు ప్రకారం.. మండలంలోని రేగులపల్లె గ్రామానికి చెందిన జెల్ల శేఖర్(35) టాటా ఏసీ వాహనం నడుపుతూ జీవనం సాగిస్తుండేవాడు. కోహెడ మండలంలోని శనిగరం గ్రామం నుంచి శేఖర్ గురువారం ఓ కారు అద్దెకు తీసుకుని పని నిమిత్తం కరీంనగర్ వెళ్లాడు. గుగ్గిల్ల క్రాస్‌రోడ్డు సమీపంలోని రాజీవ్ రహదారికి చేరేసరికి కారు పల్టీలు కొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆయనను స్థానికులు సిద్దిపేట ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తెలు ఉన్నారు. కారును వెనుక నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి ఉండొచ్చని మృతుడి భార్య రేఖ అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి ఏఎస్‌ఐ రాములు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌ఓ తిరుపతి తెలిపారు.


